New Rules From May 1 : రేపటి నుంచి మారనున్న రూల్స్.. గ్యాస్ సిలిండర్ నుంచి బ్యాంకింగ్ వరకు అన్నీ కొత్తవే

New Rules From May 1 : సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన కొన్ని మార్పులు సహజమే కానీ, ఈసారి బ్యాంకింగ్, గ్యాస్, ప్రయాణాలకు సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలు రావడం చర్చనీయాంశంగా మారింది.

CR Reddy
Published on: 30 April 2026 7:07 AM IST
New Rules From May 1
X

New Rules From May 1

New Rules From May 1 : మే నెల వచ్చేస్తోంది.. సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా, బడ్జెట్ తలకిందులు అయ్యేలా కొన్ని కీలక మార్పులు మే 1వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన కొన్ని మార్పులు సహజమే కానీ, ఈసారి బ్యాంకింగ్, గ్యాస్, ప్రయాణాలకు సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ చుట్టూ ముసురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల సెగ ఇప్పుడు నేరుగా మన వంటింటిపై పడబోతోంది. అందుకే రేపు ఉదయం నిద్రలేవగానే షాక్ తినకుండా ఉండాలంటే, ఈ రాత్రికి రాత్రే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే.

వరుసగా మూడో నెల.. గ్యాస్ ధరల వాత?

ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ కంపెనీలు ధరలను సమీక్షిస్తాయి. అయితే ఈసారి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగడం మనపై ప్రభావం చూపనుంది. దీనివల్ల మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశముందని సమాచారం. ఇదే జరిగితే వరుసగా మూడు నెలలు ధరలు పెరిగినట్టు అవుతుంది. దీనికి తోడు, గ్యాస్ బుకింగ్ విషయంలో 25 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన కూడా రాబోతోంది, అంటే సిలిండర్ అవసరానికి ముందే జాగ్రత్త పడటం మంచిది.

బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ కట్.. చెక్ చేసుకోండి

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పథకాల వార్షిక ప్రీమియం మే నెలలో మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. చాలామంది తమ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచుకోరు, కానీ ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కట్ అయ్యే సమయానికి సరిపడా నిల్వలు లేకపోతే.. మీ పాలసీ రద్దయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మే ఒకటో తేదీ కల్లా మీ అకౌంట్లో తగినంత సొమ్ము ఉండేలా చూసుకోండి.

కేవైసీ గడువు ముగుస్తోంది

మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి కేవైసీ అప్‌డేట్ చేయమని ఇప్పటికే బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వచ్చి ఉంటాయి. దీనికి మే 1వ తేదీయే ఆఖరి గడువుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు కేవైసీ పూర్తి చేయకపోతే, మీ ఖాతా నిలిచిపోయే అవకాశం ఉంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవచ్చు. లావాదేవీలు ఆగిపోతే ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి వెంటనే మీ బ్యాంక్ పని పూర్తి చేసుకోండి.

రైలు టికెట్ క్యాన్సిలేషన్ - కొత్త రూల్స్

రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త షాక్ ఇచ్చింది. మే 1 నుంచి రీఫండ్ నిబంధనలు మారుతున్నాయి. ఇకపై రైలు బయలుదేరడానికి కనీసం 8 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి. అంతకంటే తక్కువ సమయం ఉంటే మాత్రం ఒక్క రూపాయి కూడా రీఫండ్ రాదని తెలుస్తోంది. ప్రయాణం రద్దు చేసుకోవాలనుకునే వారు ముందే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే టికెట్ డబ్బులు గాల్లో కలిసినట్టే!

గేమర్లకు కొత్త చట్టం - ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్

ఆన్‌లైన్ గేమింగ్ ప్రియులకు కూడా మే 1 నుంచి కొత్త రూల్స్ వర్తించనున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు కాబోతోంది. ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ యాక్ట్-2025 ప్రకారం ఇకపై అన్ని గేమింగ్ కంపెనీలు కఠినమైన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. గేమ్ సర్టిఫికేషన్ గడువును 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. సైబర్ మోసాలను అరికట్టడానికి, గేమింగ్ వ్యసనాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story