New Toll Rates : ఏప్రిల్ 1 నుంచి టోల్ బాదుడు.. యాన్యువల్ పాస్ ధర పెంచిన ఎన్‌హెచ్‌ఏఐ

New Toll Rates : ఏప్రిల్ 1 నుంచి వార్షిక టోల్ పాస్ ధర రూ.3,075 కి పెరుగుతోంది. ఒక ఏడాది గడువు లేదా 200 టోల్ క్రాసింగ్‌లకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది.

CR Reddy
Published on: 14 March 2026 7:17 AM IST
Toll Plaza
X

 Toll Plaza

New Toll Rates : నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారుల జేబులకు ఏప్రిల్ 1 నుంచి మరికొంత చిల్లు పడనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టోల్ ధరలను సవరిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వార్షిక టోల్ పాస్ (Annual Toll Pass) ధరను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. గతంలో రూ.3,000 గా ఉన్న ఈ పాస్ ధర ఇప్పుడు రూ.3,075 కి చేరింది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి.

ఈ యాన్యువల్ పాస్ సౌకర్యం కేవలం వ్యక్తిగత అవసరాల కోసం వాడే ప్రైవేట్ వాహనాలకు (నాన్-కమర్షియల్) మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా మీ వాహనానికి పనిచేసే ఫాస్టాగ్ (FASTag) కచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడొక మెలిక కూడా ఉంది. ఈ రూ.3,075 పాస్ తీసుకుంటే అది ఒక ఏడాది పాటు పనిచేస్తుంది లేదా కేవలం 200 సార్లు టోల్ ప్లాజా దాటే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే, మీరు తీసుకున్న నెల రోజుల్లోనే 200 సార్లు టోల్ గేట్ దాటితే, ఆ తర్వాత మళ్ళీ కొత్తగా పాస్ తీసుకోవాల్సి ఉంటుంది లేదా విడిగా టోల్ చెల్లించాల్సి వస్తుంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ఏడాది టోల్ ధరలను సమీక్షించడం సహజమేనని, ఆ ప్రక్రియలో భాగంగానే ఈ స్వల్ప పెంపుదల చేశామని అధికారులు చెబుతున్నారు. హైవేలపై నిత్యం ప్రయాణించే వారికి ప్రతీసారి టోల్ దగ్గర ఆగి డబ్బులు చెల్లించే ఇబ్బంది లేకుండా ఈ పాస్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ కొత్త రేట్ల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించాలని టోల్ ప్లాజా నిర్వహణ సంస్థలకు ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఈ యాన్యువల్ పాస్ పొందడం ఇప్పుడు చాలా సులభం. మీ ఫాస్టాగ్ ఏ బ్యాంక్ ద్వారా తీసుకున్నారో ఆ బ్యాంక్ వెబ్సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి యాన్యువల్ పాస్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ వాహనం వివరాలు ఇచ్చి ఆన్‌లైన్‌లో రూ.3,075 చెల్లిస్తే చాలు. ఆ పాస్ నేరుగా మీ ఫాస్టాగ్ ఖాతాకు లింక్ అవుతుంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆఫీసు పనుల నిమిత్తం లేదా వ్యాపార రీత్యా రోజూ హైవేలపై ప్రయాణించే వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వల్ల కొంతవరకు ఖర్చును ఆదా చేసుకోవచ్చు.

CR Reddy

CR Reddy

Next Story