No UPI Day: ఫోన్‌పే, గూగుల్ పే బంద్.. ఈరోజు దుకాణాల్లో కేవలం క్యాషే
No UPI Day: దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు, దుకాణదారులు అక్టోబర్ 2న నో యూపీఐ డే పాటించాలని నిర్ణయించారు.
No UPI Day
No UPI Day: దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు, దుకాణదారులు అక్టోబర్ 2న నో యూపీఐ డే పాటించాలని నిర్ణయించారు. ముంబై నుంచి ఢిల్లీ వరకు క్యూఆర్ కోడ్ స్కానర్లను నల్లటి బట్టలతో కప్పి ఉంచుతామని ప్రకటించారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకునే సౌండ్ బాక్సులు కూడా ఈ రోజు పూర్తిగా మూగబోనున్నాయి. అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై 0.40 శాతం మేర ఎండీఆర్ చార్జీలు విధించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపడుతున్నారు. పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ కొత్త నిబంధన తమ నడ్డి విరుస్తుందని ట్రేడర్లు వాపోతున్నారు.
ఎండీఆర్ చార్జీలతో పెరగనున్న వ్యాపార భారం
వ్యాపారులు అందరి వ్యతిరేకతకు ప్రధాన కారణం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR). రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వం ఈ చార్జీని వసూలు చేయనుంది. రిటైల్ ట్రేడర్స్ అసోసియేషన్ సహా పలు సంఘాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇప్పటికే వ్యాపారులకు వచ్చే లాభం చాలా తక్కువగా ఉంటుందని, ఇలాంటి అదనపు చార్జీలు చెల్లిస్తే వ్యాపారం చేయడం కష్టమని వారు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారు రూ.10 వేల విలువైన వస్తువులు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే, వ్యాపారి ఖాతా నుంచి నేరుగా రూ.40 కట్ అవుతుంది. పండుగల సమయంలో పెద్దమొత్తంలో కొనుగోళ్లు జరిగే వేళ ఈ చార్జీలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఇస్తున్న మినహాయింపులు ఏమిటి?
ఈ విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కేవలం పెద్ద వ్యాపారులపై మాత్రమే ఈ నిబంధన ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. నెలకు రూ.లక్ష కంటే తక్కువ యూపీఐ ఆదాయం ఉన్న చిన్న దుకాణదారులను ఈ ఎండీఆర్ చార్జీల పరిధి నుంచి పూర్తిగా మినహాయించారు. అంతేకాకుండా పెద్ద లావాదేవీలపై గరిష్ట చార్జీని రూ.300 వరకు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. అంటే ఎంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినా గరిష్టంగా రూ.300 మాత్రమే కట్ అవుతుంది. ఈ చార్జీల ద్వారా వచ్చే డబ్బు ప్రభుత్వ ఖాజానాకు వెళ్లదని, కేవలం బ్యాంకులు, పేమెంట్ యాప్‌ల నిర్వహణ కోసమే ఈ నెట్‌వర్క్ పనిచేస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
మార్కెట్లో భిన్న స్పందనలు
ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ నిరసనకు పూర్తి మద్దతు ఇస్తుండగా, ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) మాత్రం ఈ సమ్మె నుంచి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీతో సహా వందలాది వ్యాపార సంఘాలు ఈ బంద్‌లో భాగస్వామ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అక్టోబర్ 2న షాపింగ్ కోసం వెళ్లేటప్పుడు ఆన్‌లైన్ పేమెంట్లపై పూర్తిగా ఆధారపడకుండా తగినంత నగదు లేదా డెబిట్, క్రెడిట్ కార్డులను వెంట ఉంచుకోవడం మంచిది.




