Onion Price Hike: భగ్గుమంటున్న ఉల్లి ధరలు... రంగంలోకి 'కండా ఎక్స్‌ప్రెస్'!

Onion Price Hike: దేశంలో ఉల్లి ధరలు 50 శాతం మేర పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలను నియంత్రించేందుకు కేంద్రం ‘కండా ఎక్స్‌ప్రెస్’ను రంగులోకి దింపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Aug 2026 5:06 AM IST
Onion Price Hike
X

Onion Price Hike: భగ్గుమంటున్న ఉల్లి ధరలు... రంగంలోకి 'కండా ఎక్స్‌ప్రెస్'!

Onion Price Hike: దేశంలో ఉల్లి ధరలు ఒక్కసారిగా భగ్గుమంటూ సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఉల్లి సగటు ధరలు ఏకంగా 50 శాతం పెరిగి, బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 55 నుంచి రూ. 65 వరకు అమ్ముడవుతున్నాయి. చక్కెర ధర ఇప్పటికే రూ.70 మార్కును తాకగా, ఇప్పుడు ఉల్లిపాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకడంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది.

రాజకీయాలను శాసించే ఉల్లి.. నాసిక్‌లో పెరిగిన ధరలు

భారత రాజకీయాల్లో ఉల్లిపాయలకు ప్రత్యేక స్థానముంది. 1980 లోక్‌సభ ఎన్నికల నుంచి 1998 ఢిల్లీ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఉల్లి ధరలే ప్రభుత్వాల జాతకాలను మార్చేశాయి. ప్రస్తుతం నాసిక్‌లోని అతిపెద్ద మార్కెట్‌లో టోకు ధరలు 76 శాతం పెరగడంతో ఢిల్లీ, నోయిడా, చెన్నై, లక్నో తదితర నగరాల్లో రిటైల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఖరీఫ్ పంట దిగుబడి తగ్గడం, రబీ నిల్వలు ముగియడం మరియు కొత్త పంట రావడంలో ఆలస్యమవ్వడమే ఈ కొరతకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ధరల కట్టడికి కేంద్రం 'కండా ఎక్స్‌ప్రెస్'

ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎన్‌సీసీఎఫ్ (NCCF), నాఫెడ్ (NAFED) వద్ద ఉన్న 1.2 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. రవాణా ఖర్చులను తగ్గించి, త్వరగా పంపిణీ చేయడానికి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గౌహతి ప్రాంతాలకు ప్రత్యేకంగా 'కండా ఎక్స్‌ప్రెస్' సరుకు రవాణా రైళ్లను ప్రారంభించింది. దీని ద్వారా తక్కువ ధరకే ఉల్లిని సరఫరా చేసి, కృత్రిమ కొరత సృష్టించే బ్లాక్ మార్కెటీర్లపై ఉక్కుపాదం మోపడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story