EPF: ఈపీఎఫ్ ఖాతాల్లో కదలకుండా పడి ఉన్న రూ. 9,300 కోట్లు!

EPF: కేంద్ర ప్రభుత్వం ‘ఈపీఎఫ్ స్కీమ్‌- 2026’ తెచ్చినా, దేశంలో ఇంకా 30.91 లక్షల ఇన్‌యాక్టివ్ పీఎఫ్ ఖాతాల్లో రూ. 9,330 కోట్లకు పైగా నిధులు క్లెయిమ్ కాకుండా పడి ఉన్నాయి.

Naresh.k
Published on: 4 July 2026 7:27 AM IST
EPF
X

EPF: ఈపీఎఫ్ ఖాతాల్లో కదలకుండా పడి ఉన్న రూ. 9,300 కోట్లు!

EPF Scheme 2026: కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ స్కీమ్‌- 2026ను తీసుకువచ్చి, పీఎఫ్ నిబంధనలను పూర్తిగా డిజిటలైజ్ చేసినప్పటికీ.. క్లెయిమ్ కాని సొమ్ము సమస్య మాత్రం దేశాన్ని ఇంకా వేధిస్తూనే ఉంది. మనం కష్టపడి దాచుకున్న సొమ్మును ఉద్యోగాలు మారినప్పుడు, లేదా రిటైర్ అయ్యాక మర్చిపోవడం వల్ల వేల కోట్లు ప్రభుత్వ ఖాతాల్లోనే మూలనపడిపోతున్నాయి. ఇటీవల ఇండియా టుడే సేకరించిన ప్రత్యేక ఆర్టీఐ నివేదిక ద్వారా షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

ఆర్టీఐ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 30.91 లక్షల ఇన్‌యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. చందాదారులు ఎలాంటి లావాదేవీలు జరపకుండా వదిలేసిన ఈ అకౌంట్లలో ఏకంగా రూ. 9,330 కోట్లకు పైగా నిధులు కదలకుండా ఉండిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఇన్‌యాక్టివ్ ఖాతాల సంఖ్య 92,000, నిలిచిపోయిన సొమ్ము రూ. 851 కోట్లు తగ్గాయి. అయినప్పటికీ, దాదాపు 31 లక్షల అకౌంట్లలో వేల కోట్ల రూపాయల కార్మికుల పదవీ విరమణ పొదుపు నిధులు ఇంకా క్లెయిమ్ కాకుండా పడి ఉండటం ఆందోళనకరం.

పీఎఫ్ ఖాతాల్లో మూలనపడ్డ ఈ సొమ్ము ఎంత పెద్దదో అర్థం కావడానికి నిపుణులు ప్రభుత్వ వ్యయాలతో పోల్చి చూపిస్తున్నారు. ఆ లెక్కలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ప్రాంతీయ విమానయాన పథకం ఉడాన్ కోసం 2016 నుంచి ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం నిధులు ఈ పీఎఫ్ సొమ్ముతో దాదాపు సమానం.

ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి ‘ఆయుష్మాన్ భారత్’ ఉచిత వైద్య బీమా పథకం కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌కు కూడా ఇది ఇంచుమించు సరిపోతుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ లెక్కల ప్రకారం ఒక కొత్త ఐఐటీని నిర్మించడానికి సుమారు రూ. 2,934 కోట్లు ఖర్చవుతుంది. అంటే, పీఎఫ్ ఖాతాల్లో పడి ఉన్న ఈ సొమ్ముతో ఏకంగా మూడు ఐఐటీలను నిర్మించి, ఇంకా రూ. 500 కోట్లకు పైగా మిగుల్చుకోవచ్చు.

అయితే ఈ నిష్క్రియ ఖాతాల వెనుక ఉన్న పూర్తి వివరాలను వెల్లడించడానికి ఈపీఎఫ్ఓ నిరాకరించడం గమనార్హం. గత ఐదేళ్ల ట్రెండ్ అడగగా.. 2025-26లోనే ప్రత్యేకంగా ఇనాపరేటివ్ అకౌంట్స్ సెల్‌ను ఏర్పాటు చేశామని, అందుకే గత రెండేళ్ల డేటా మాత్రమే ఉందంటూ పాత లెక్కలను దాటవేసింది. రూ. 5 లక్షల కంటే ఎక్కువ నిల్వలున్న పెద్ద అకౌంట్ల వివరాలు తమ వద్ద విడిగా లేవని పేర్కొంది. ఏ అకౌంట్లు ఆధార్‌తో లింక్ అయ్యాయి, వేటికి ఆటో-సెటిల్‌మెంట్ సాధ్యమవుతుంది అనే కీలకమైన సమాచారాన్ని క్లాజ్ ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(e) కింద చెప్పడానికి నిరాకరించింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story