PAN Card Rules : పాన్ కార్డ్ కేవలం ఐటీఆర్ కోసమే కాదు.. ఈ 5 లావాదేవీలకు పాన్ నంబర్ తప్పనిసరి
PAN Card Rules : పాన్ కార్డ్ కేవలం ట్యాక్స్ రిటర్న్స్ కోసమే కాకుండా ఆస్తి, వాహనాల కొనుగోలు వంటి 5 పెద్ద ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి. తప్పుడు పాన్ ఇస్తే రూ.10,000 జరిమానా విధిస్తారు.
PAN Card Rules
PAN Card Rules : చాలా మంది ప్రజలు పాన్ కార్డ్‌ను కేవలం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి మాత్రమే ఉపయోగించే ఒక సాధారణ పత్రంగా భావిస్తారు. కానీ వాస్తవానికి పాన్ కార్డ్ అనేది దేశంలో పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి అత్యంత కీలకమైన పత్రం. బ్యాంక్ ఖాతా తెరవడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వంటి అనేక పనులకు పాన్ నంబర్ ఇవ్వడం చట్టరిత్యా తప్పనిసరి.
ఆదాయం, ఖర్చులపై ఐటీ శాఖ నిఘా
ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ ఆధారంగానే దేశంలోని పౌరుల పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచుతుంది. ఒక వ్యక్తి అసలు వార్షిక ఆదాయం ఎంత? అతను మార్కెట్‌లో చేస్తున్న ఖర్చులు లేదా పెట్టుబడులు ఎంత? అనే రికార్డులను పక్కాగా ట్రాక్ చేయడానికి పాన్ నంబర్ ఉపయోగపడుతుంది. దీనివల్ల పన్ను ఎగవేతదారులను గుర్తించడం ఆదాయపు పన్ను శాఖకు చాలా సులభం అవుతుంది.
ఈ 5 లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి
ప్రస్తుత నిబంధనల ప్రకారం కింది ఐదు రకాల ప్రధాన ఆర్థిక లావాదేవీలలో పాన్ నంబర్ ఇవ్వడం పూర్తిగా నిబంధనలకు లోబడి ఉండాలి.
* ఆస్తి కొనుగోలు/అమ్మకం: రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తి, ఇల్లు లేదా భూమి కొనుగోలు లేదా విక్రయాల సమయంలో పాన్ కార్డ్ ఇవ్వాలి.
* భారీ కొనుగోళ్లు: ఏదైనా వస్తువులు లేదా సేవల కోసం ఒకేసారి రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేసినప్పుడు.
* అన్‌లిస్టెడ్ షేర్లు: స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాని కంపెనీల షేర్లను రూ.1 లక్ష కంటే ఎక్కువ విలువతో కొనుగోలు లేదా విక్రయం చేసినప్పుడు.
* వాహనాల కొనుగోలు: రూ.5 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన కారు లేదా ఖరీదైన మోటార్ సైకిల్ కొనుగోలు చేసే సమయంలో.
* పెట్టుబడులు: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం లేదా మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాన్ తప్పనిసరి.
పాన్ కార్డ్ ఇవ్వకపోతే ఐటీ నోటీసులు వస్తాయా?
చట్ట ప్రకారం కొన్ని నిర్దేశిత లావాదేవీలలో పాన్ కార్డ్ వివరాలను సమర్పించడం తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా పాన్ నంబర్ ఇవ్వడానికి నిరాకరిస్తే.. సదరు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆ లావాదేవీని ముందుకు తీసుకెళ్లడానికి నిరాకరిస్తాయి. మనం పాన్ కార్డ్ ఇచ్చినప్పుడు ఆ సమాచారం అంతా TDS, TCS, స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ (SFT), యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS) వంటి ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్‌లలో రికార్డ్ అవుతుంది. ఒకవేళ మీరు ఐటీ రిటర్న్స్‌లో చూపించిన ఆదాయానికి, మీ పాన్ కార్డు ద్వారా జరిగిన భారీ ఖర్చులకు పొంతన లేకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ అవుతాయి.
తప్పుడు సమాచారం ఇస్తే రూ.10,000 ఫైన్
ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం.. ఏదైనా ఆర్థిక లావాదేవీల సమయంలో కావాలని లేదా పొరపాటున తప్పుడు లేదా నకిలీ పాన్ నంబర్ ఇస్తే చట్ట ప్రకారం రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా రికార్డులలో తప్పుడు సమాచారం ఉండటం వల్ల ట్యాక్స్ క్రెడిట్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఆదాయపు పన్ను శాఖ మీ ఖాతాలపై అదనపు విచారణ లేదా తనిఖీలు చేపట్టే ప్రమాదం ఉంది. అందుకే ఆర్థిక పత్రాలలో పాన్ నంబర్ నమోదు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.




