Patanjali: పతంజలిలో డబ్బులు పెట్టారా..? అయితే మీ కొంప కొల్లేరే!

Patanjali: పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పతనమయ్యాయి.

Naresh.k
Published on: 16 July 2026 8:40 AM IST
Patanjali
X

Patanjali: పతంజలిలో డబ్బులు పెట్టారా..? అయితే మీ కొంప కొల్లేరే!

Patanjali Foods: భారతదేశంలోని దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటైన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. వంటనూనెలు, సోయా ఉత్పత్తులు, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల తయారీలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఈ సంస్థ షేర్లు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బుధవారం సెషన్‌లో ఈ స్టాక్ ఊహించని విధంగా భారీగా పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.

నిజానికి మంగళవారం నాటి సెషన్‌లో ఈ షేరు ధర రూ. 407.55 వద్ద ముగియగా, బుధవారం ఉదయం రూ. 407.50 స్వల్ప తగ్గుదలతో ఓపెన్ అయింది. అయితే మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో షేరు ధర కుప్పకూలుతూ వచ్చింది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్ మొత్తం మార్కెట్ విలువ రూ. 12.62 వేల కోట్లుగా నమోదైంది.

ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 653.93 గా ఉంటే, కనిష్ఠ ధర రూ. 328.20 గా ఉంది. గత కొంత కాలంగా ఈ స్టాక్ ఇన్వెస్టర్ల సంపదను భారీగా హరిస్తోంది. కేవలం గత ఐదు రోజుల్లోనే 16 శాతం మేర పడిపోయిన ఈ షేరు, గత నెల రోజుల్లో 18 శాతం, ఆరు నెలల్లో 33 శాతం నష్టపోయింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే 37 శాతం కుదేలవగా, గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 40 శాతం మేర పతనమై స్వల్ప కాలంలో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది.

బుధవారం నాటి ట్రేడింగ్‌లో పతంజలి ఫుడ్స్ షేర్లు ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోవడానికి ప్రధాన కారణం మార్కెట్లో జరిగిన భారీ బ్లాక్ డీల్స్ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. సమాచారం ప్రకారం, సుమారు 54.24 లక్షల షేర్లు బ్లాక్ డీల్స్ ద్వారా చేతులు మారాయి. ఒక్కో షేరుకు రూ. 355 ధర చొప్పున ఈ డీల్ జరగ్గా, దీని మొత్తం విలువ దాదాపు రూ. 195 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఈ డీల్ జరగడం వల్ల ఒక్కసారిగా స్టాక్ పై ఒత్తిడి పెరిగి వరుసగా మూడో రోజు కూడా పతనబాట పట్టింది. సాధారణంగా బ్లాక్ డీల్స్ అనేవి రెండు వర్గాల పరస్పర అంగీకారంతో స్టాక్ మార్కెట్ ప్రీ ఓపెనింగ్ సమయంలో ఒక స్పెషల్ విండో ద్వారా జరుగుతుంటాయి. వీటిని నిబంధనల ప్రకారం సెబీకి కూడా నివేదిస్తారు.

ఈ సంస్థ నేపథ్యాన్ని గమనిస్తే, 1986లో దినేష్ సహారా రుచి సోయా ఇండస్ట్రీస్ పేరిట ఈ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 2017లో బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలకు చెందిన పతంజలి ఆయుర్వేద్ సంస్థ తన వంట నూనెల ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ కోసం రుచి సోయాతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. కాలక్రమేణా రుచి సోయా సంస్థ ఆర్థిక సంక్షోభంలో పడి దివాలా తీయడంతో, 2019లో పతంజలి ఆయుర్వేద్ సంస్థ రంగంలోకి దిగి రూ. 4350 కోట్లకు దీనిని కొనుగోలు చేసి పతంజలి ఫుడ్స్‌గా పేరు మార్చింది.

ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో మెజార్టీ వాటా ఆచార్య బాలకృష్ణ పేరిట ఉంది. యోగా గురు బాబా రాందేవ్‌కు ఇందులో అధికారికంగా షేర్ల వాటా లేకపోయినప్పటికీ, మొత్తం పతంజలి సామ్రాజ్యానికి ఆయనే మూలస్తంభం. కంపెనీలో ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరియు ఆయన్ను ప్రమోటర్ గ్రూపులో భాగంగానే పరిగణిస్తారు.

పతంజలి ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండ్ వాల్యూ అంతా రాందేవ్ బాబా ముఖచిత్రంపైనే నడుస్తుండటంతో ఆయనే ఈ సంస్థకు అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ వరుస నష్టాల నుంచి పతంజలి ఫుడ్స్ స్టాక్ ఎప్పుడు కోలుకుంటుందో, ఇన్వెస్టర్లకు ఎప్పుడు లాభాల రుచి చూపిస్తుందో వేచి చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story