Personal Loan: పే స్లిప్ లేకపోతే పర్సనల్ లోన్ పొందలేమా.? వేరే ఆప్షన్ లేదా.?
Personal Loan: అత్యవసర అవసరాలకు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే సాధారణంగా బ్యాంకులు పే స్లిప్‌లు అడుగుతాయి.
Personal Loan: పే స్లిప్ లేకపోతే పర్సనల్ లోన్ పొందలేమా.? వేరే ఆప్షన్ లేదా.?
Personal Loan: అత్యవసర అవసరాలకు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే సాధారణంగా బ్యాంకులు పే స్లిప్‌లు అడుగుతాయి. అయితే, వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందేవారికి పే స్లిప్ లేకున్నా రుణం పొందే అవకాశం ఉంది. ఆదాయాన్ని నిరూపించే ఇతర పత్రాలతో లోన్ పొందేందుకు ఉన్న నాలుగు మార్గాలేంటో తెలుసుకుందాం.
రెండేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులు
పే స్లిప్ అందుబాటులో లేకపోతే ఆదాయానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఆధారంగా ఆదాయపు పన్ను రిటర్నులను (ITR) సమర్పించవచ్చు.
ముఖ్యంగా స్వయం ఉపాధి పొందేవారు, కన్సల్టెంట్లు, చిన్న వ్యాపారులకు ఇవి ఉపయోగపడతాయి. గత రెండేళ్లుగా దాఖలు చేసిన ఐటీఆర్ పత్రాల ద్వారా వారి వార్షిక ఆదాయం, ఆర్థిక స్థితిని బ్యాంకులు అంచనా వేయగలవు. కాబట్టి లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఐటీఆర్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
బ్యాంక్ స్టేట్‌మెంట్లు, వ్యాపార ధ్రువపత్రాలు
మీ ఆదాయం క్రమం తప్పకుండా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంటే, ఆ లావాదేవీలే ఆదాయానికి ఆధారంగా ఉపయోగపడవచ్చు. సాధారణంగా బ్యాంకులు గత 6 నుంచి 12 నెలల ఖాతా వివరాలను పరిశీలించి నగదు జమలు, ఖర్చులు, ఖాతాలో నిల్వలను అంచనా వేస్తాయి.
వ్యాపారులు తమ కార్యకలాపాలకు సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్, షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికెట్ వంటి పత్రాలను కూడా సమర్పించవచ్చు. వీటి ద్వారా వ్యాపారం కొనసాగుతున్న తీరును, ఆదాయ వనరులను బ్యాంకుకు వివరించవచ్చు.
మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి
పర్సనల్ లోన్ మంజూరులో క్రెడిట్ స్కోర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పే స్లిప్ లేని సందర్భాల్లో రుణగ్రహీత గతంలో తీసుకున్న రుణాలను ఎలా తిరిగి చెల్లించారనే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తాయి. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే రుణం పొందే అవకాశాలు మెరుగుపడవచ్చు.
గతంలో ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోగా చెల్లించడం, రుణాల విషయంలో డిఫాల్ట్ కాకపోవడం మంచి క్రెడిట్ చరిత్రకు దోహదపడతాయి. అయితే, మంచి స్కోర్ ఉన్నంత మాత్రాన రుణం తప్పనిసరిగా మంజూరవుతుందని భావించకూడదు.
బ్యాంకుతో కొనసాగుతున్న లావాదేవీలు
మీరు ఇప్పటికే ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా నిర్వహిస్తున్నట్లయితే అది కూడా రుణ దరఖాస్తు సమయంలో ఉపయోగపడవచ్చు.
ఖాతాలో క్రమం తప్పకుండా లావాదేవీలు జరపడం, తగినంత నిల్వలు ఉంచడం, గతంలో తీసుకున్న రుణాలు లేదా క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో చెల్లించడం ద్వారా బ్యాంకుతో మంచి ఆర్థిక సంబంధాన్ని కొనసాగించవచ్చు. ఇలాంటి ఖాతాదారుల ఆర్థిక లావాదేవీలను బ్యాంకులు సులభంగా పరిశీలించగలవు. దీంతో పే స్లిప్ లేకపోయినా ఇతర అర్హతలు సరిపోతే రుణం మంజూరుకు అవకాశం ఉంటుంది.




