Petrol Price Hike: వాహనదారులకు బిగ్ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
Petrol Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. నయారా ఎనర్జీ సంస్థ లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Petrol Price Hike
Petrol Price Hike: దేశంలోని వాహనదారులకు ప్రైవేట్ ఇంధన దిగ్గజం గట్టి షాకిచ్చింది. ప్రముఖ ఇంధన రిటైల్ సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధరపై రూ.5 అలాగే లీటర్ డీజిల్ ధరపై రూ.3 మేర ధరలను పెంచింది. ఈ కొత్త రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, రిఫైనింగ్ ఉత్పత్తుల తయారీ ఖర్చులు విపరీతంగా భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
అంతర్జాతీయ ముడి చమురు ప్రభావం
భారతదేశం తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్లో వచ్చే ప్రతి చిన్న మార్పు దేశీయ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, రిఫైనింగ్ వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో ఇంధన కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కొనుగోలు ఖర్చులకు, దేశీయ విక్రయ ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు నయారా ఎనర్జీ ఈ తాజా ధరల పెంపు నిర్ణయాన్ని అమలు చేసింది.
నయారా నెట్‌వర్క్, వ్యాపార ప్రభావం
గుజరాత్‌లోని వాడినార్‌లో భారీ రిఫైనరీని నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ దేశవ్యాప్తంగా ఏడు వేలకు పైగా ఇంధన స్టేషన్లను కలిగి ఉంది. ప్రైవేట్ బంకుల్లో ఈ ధరల పెంపు కారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీల అవుట్‌లెట్లకు, ప్రైవేట్ బంకులకు మధ్య ధరల వ్యత్యాసం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇతర ప్రభుత్వ రంగ రిటైలర్లు కూడా భవిష్యత్తులో ధరలను సవరిస్తే రవాణా ఖర్చులు, నిత్యవసర వస్తువుల ధరలపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
మార్కెట్ నష్టాలు, ఆర్థిక నిపుణుల అంచనాలు
గత నెలలో రేటింగ్ ఏజెన్సీ ఐక్రా అంచనా ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై సుమారు ఎనిమిది రూపాయలు, డీజిల్‌పై రూ.9 వరకు ప్రతికూల మార్జిన్‌ను ఎదుర్కొన్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉంటేనే బ్రేక్-ఈవెన్ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో రిటైల్ ధరలను సవరించకపోతే కంపెనీల క్యాష్ ఫ్లో దెబ్బతింటుంది. ఈ కారణంగానే ప్రైవేట్ కంపెనీలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ ధరలను సవరించుకోవాల్సి వస్తోంది.
సామాన్యులపై భారం, రవాణా వ్యయం
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నేరుగా సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా డీజిల్ ధరలు పెరగడం వల్ల లారీలు, ఇతర రవాణా వాహనాల సరుకు రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్లో కూరగాయలు, నిత్యవసర వస్తువులు, పాలు వంటి అన్ని రకాల వస్తువుల ధరలు క్రమంగా పెరిగి ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




