Petrol Consumption: భారతీయులు రోజుకు ఎంత పెట్రోల్ ఉపయోగిస్తారో తెలుసా.?
Petrol Consumption: ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది.
Petrol Consumption: భారతీయులు రోజుకు ఎంత పెట్రోల్ ఉపయోగిస్తారో తెలుసా.?
Petrol Consumption: ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ రోజుకు ఎంత పెట్రోల్, డీజిల్ వినియోగిస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా.?
భారత్‌లో రోజుకు ఎంత పెట్రోల్ వినియోగిస్తున్నారు?
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రజలు రోజుకు సుమారు 130 మిలియన్ లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్నారు. ఏడాదికి ఇది దాదాపు 47.5 బిలియన్ లీటర్లకు చేరుకుంటుంది. దేశంలో వాహనాల సంఖ్య పెరగడం, నగరీకరణ వేగంగా జరగడం వల్ల ఇంధన వినియోగం కూడా భారీగా పెరుగుతోంది.
డీజిల్ వినియోగం పెట్రోల్ కంటే ఎక్కువ
భారత్‌లో డీజిల్ వినియోగం మరింత ఎక్కువగా ఉంది. దేశంలో రోజుకు దాదాపు 290 నుంచి 300 మిలియన్ లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది పెట్రోల్ వినియోగంతో పోలిస్తే రెండింతలకు పైగా ఉంటుంది. ముఖ్యంగా రవాణా రంగం, వ్యవసాయం, పరిశ్రమల్లో డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది.
విదేశీ చమురుపైనే భారత్ అధిక ఆధారపడటం
భారత్‌కు అవసరమైన ముడి చమురులో సుమారు 80% నుంచి 85% వరకు విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. దేశ అవసరాలను తీర్చేందుకు భారత్ రోజుకు దాదాపు 5 నుంచి 5.5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగితే లేదా సరఫరాలో అంతరాయం ఏర్పడితే భారత్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
డిమాండ్ పెరుగుతుండగా సరఫరాపై ఒత్తిడి
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఇంధన వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే దేశీయ ఉత్పత్తి మాత్రం అంత వేగంగా పెరగడం లేదు. నివేదికల ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల్లో కేవలం 0.4% వృద్ధి మాత్రమే నమోదైంది. కానీ వినియోగం మాత్రం భారీగా పెరిగింది. దీంతో డిమాండ్, సరఫరా మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఫలితంగా దిగుమతులపై ఆధారపడటం మరింత పెరిగి చమురు కంపెనీలు, ఇంధన పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది.
భారత్ వద్ద ప్రస్తుతం ఎంత ఇంధన నిల్వ ఉంది?
ఎమర్జెన్సీ పరిస్థితులు లేదా సరఫరా అంతరాయాలను ఎదుర్కొనేందుకు భారత్ వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వంతో పాటు ఆయిల్ కంపెనీలు కూడా వాణిజ్య నిల్వలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 60 రోజుల పాటు దేశీయ అవసరాలను తీర్చగలిగేంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ పరిస్థితులు మరింత దిగజారితే ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




