Petro Price Hike : వాహనదారులకు పెద్ద షాక్.. లీటరుపై మరో రూ. 5 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petro Price Hike : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, చమురు కంపెనీల నష్టాల వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మరో రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది.
Petro Price Hike
Petro Price Hike : దేశంలో సామాన్య ప్రజల జేబులకు మరోసారి గట్టి చిల్లు పడేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న జనాలకు, ఇంధన ధరలు మరింత షాక్ ఇవ్వబోతున్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మరో రూ. 5 నుంచి రూ. 10 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మే నెలలో ఇంధన ధరలు దాదాపు 8 శాతం పెరిగినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఆర్థిక ఇబ్బందులు తీరకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది.
రోజూ రూ.610 కోట్ల భారీ నష్టాలు
చమురు ధరలు పెరగడం వల్ల ప్రభుత్వ కంపెనీలు భారీగా లాభపడుతున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేలింది. ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ సుమారు రూ.610 కోట్ల మేర నష్టపోతున్నాయి. ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఐసిఆర్ఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. గత మే 15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.7.5 మేర పెరిగాయి. అయినప్పటికీ కంపెనీలకు పెట్రోల్‌పై లీటరుకు రూ.5.5, డీజిల్‌పై లీటరుకు రూ.4.5 చొప్పున ఇంకా నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ఇంధన ధరలను లీటరుకు కనీసం రూ.5 మేర పెంచక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.
సిలిండర్, విమాన ఇంధనంపై కూడా అదే దారి
కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా వంటగ్యాస్, విమాన ఇంధనం పై కూడా ప్రభుత్వ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఐసీఆర్ఏ అంచనాల ప్రకారం.. చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రస్తుతం ప్రతి గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై సుమారు రూ.680 వరకు నష్టం వస్తోంది. దీనితో పాటు విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) విక్రయాలపై రోజుకు దాదాపు రూ.93 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. మరో ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ విశ్లేషణ ప్రకారం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గనుక ఇదే రీతిన పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు ఏకంగా రూ.10 వరకు పెరిగే ప్రమాదం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో చుక్కలు చూపిస్తున్న క్రూడాయిల్
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరా, డిమాండ్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఇరాన్, అమెరికా దేశాల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా బ్యారెల్‌కు సగటున 112 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. ఈ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటం దేశీయంగా వినియోగదారులపై ద్రవ్యోల్బణ భారాన్ని మోపనుంది.
మధ్యప్రాచ్య సంక్షోభమే కీలక అంశం
ముడి చమురు ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా అనే విషయం ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపైనే ఆధారపడి ఉంది. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలు తుది దశకు చేరి, ఇజ్రాయెల్ వైపు నుంచి ఎలాంటి దాడులు జరగకపోతే ముడి చమురు ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే మధ్యప్రాచ్యంలో ఘర్షణలు సద్దుమణగడం లేదు. హోర్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్న ఆధిపత్య పోరు, లెబనాన్‌పై జరుగుతున్న దాడులు ఇంధన మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే భారతీయ వినియోగదారులకు ఇంధన మంటలు తప్పేలా లేవు.




