Petrol Price Today : పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి?.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర చమురు శాఖ మంత్రి

Petrol Price Today : దేశవ్యాప్తంగా జూలై 3న పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.

CR Reddy
Published on: 3 July 2026 7:32 AM IST
Petrol Price Today
X

Petrol Price Today

Petrol Price Today : దేశవ్యాప్తంగా వాహనదారులకు ఈరోజు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉపశమనం లభించింది. జూలై 3వ తేదీ శుక్రవారం కూడా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి సవరణలు చేయలేదు. జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు నిన్నటి స్థాయుల్లోనే స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ, దేశీయంగా మాత్రం సామాన్యులపై అదనపు భారం పడకుండా రేట్లు యథాతథంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 వద్ద విక్రయించబడుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ.103.82 వద్ద కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్థానిక పన్నుల వ్యత్యాసం కారణంగా హైదరాబాద్‌లో ఇంధన రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ, గత కొన్ని వారాలుగా ఇక్కడ ధరలు పెరగకపోవడం వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

ఇదిలా ఉంటే, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ చమురు రిటైలర్ అయిన నాయరా ఎనర్జీ ఇటీవల వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ బంకుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలను తగ్గించింది. ప్రైవేట్ రంగంలో ధరలు తగ్గడంతో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా త్వరలోనే తమ ఇంధన ధరలను తగ్గిస్తాయనే ఆశలు సాధారణ ప్రజల్లో, రవాణా రంగంలో గట్టిగా వ్యక్తమవుతున్నాయి.

గత కొన్ని నెలలుగా గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలే ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా స్మార్ట్ అయ్యాయి. దీంతో ప్రైవేట్ సంస్థ నాయరా ఎనర్జీ మార్చి 26న పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. ఆ తర్వాత అంతర్జాతీయంగా దిగుమతి ఖర్చులు పెరగడంతో మే నెలలో ప్రభుత్వ చమురు కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ఏకంగా రూ.7.50 వరకు పెంచాల్సి వచ్చింది.

ధరలు ఎప్పుడు తగ్గుతాయి?

సామాన్యులను వేధిస్తున్న ధరలు ఎప్పుడు తగ్గుతాయి? అనే ప్రశ్నపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలను పెంచే ఆలోచన లేదని, పెరిగిన అంతర్జాతీయ ధరల ప్రభావాన్ని ప్రభుత్వం విజయవంతంగా నియంత్రించిందని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా రిటైల్ మార్కెట్‌లో ఆ ప్రభావం వెంటనే కనిపించదని ఆయన వివరించారు. ఎందుకంటే ఇప్పుడు బంకుల్లో అమ్ముడవుతున్న ఇంధనానికి సంబంధించిన ముడి చమురును రెండు నెలల క్రితమే ఎక్కువ ధరలకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లను గమనించి ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షిస్తామని, ధరలు ఇలాగే అదుపులో ఉంటే సామాన్యులకు ప్రయోజనం చేకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

దేశంలోని ప్రధాన నగరాల పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు..

* హైదరాబాద్: పెట్రోల్ రూ.115.69 | డీజిల్ రూ.103.82

* ఢిల్లీ: పెట్రోల్ రూ.102.12 | డీజిల్ రూ.95.20

* ముంబై: పెట్రోల్ రూ.111.21 | డీజిల్ రూ.97.83

* కోల్‌కతా: పెట్రోల్ రూ.113.51 | డీజిల్ రూ.99.82

* చెన్నై: పెట్రోల్ రూ.107.77 | డీజిల్ రూ.99.55

* అహ్మదాబాద్: పెట్రోల్ రూ.101.70 | డీజిల్ రూ.97.84

* పాట్నా: పెట్రోల్ రూ.113.35 | డీజిల్ రూ.99.36

* తిరువనంతపురం: పెట్రోల్ రూ.115.49 | డీజిల్ రూ.104.40

* పుణె: పెట్రోల్ రూ.111.52 | డీజిల్ రూ.98.15

* లేహ్: పెట్రోల్ రూ.109.81 | డీజిల్ రూ.97.92

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story