Petrol Price : దేశంలో నాల్గోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటరు పై ఎంత పెరిగిందంటే ?

Petrol Price : వాహనదారులకు చమురు కంపెనీలు వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి భారీగా పెంచాయి.

CR Reddy
Published on: 25 May 2026 6:48 AM IST
Petrol Price
X

Petrol Price

Petrol Price : దేశంలో ఇంధన మంటలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా చమురు కంపెనీలు సామాన్యులపై వరుసగా నాల్గోసారి ధరల భారాన్ని మోపాయి. తాజా సవరణ ప్రకారం లీటర్ డీజిల్‌పై రూ.2.71, పెట్రోల్‌పై రూ.2.61 మేర ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లోనే ఇంధన ధరలు రూ.5 వరకు పెరగడం గమనార్హం. గత రెండు వారాలుగా క్రమంగా పెరుగుతున్న ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి.

తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు చేరుకోగా, డీజిల్ ధర 95.20 రూపాయల వద్దకు చేరింది. కోల్‌కతా నగరంలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా 113.51 రూపాయలకు చేరింది, అక్కడ డీజిల్ ధర 99.82 రూపాయలుగా నమోదైంది. చెన్నైలో పెట్రోల్ ధర 107.77 రూపాయలు కాగా, డీజిల్ ధర 99.55 రూపాయలుగా స్థిరపడింది. గత కొన్ని రోజులుగా పెరిగిన ధరల గణాంకాలను పరిశీలిస్తే, చమురు కంపెనీలు మే 15న భారీగా మూడు రూపాయలు పెంచాయి. ఆ తర్వాత మే 19న 90 పైసలు, మే 23న పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగాయి.

దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ముడిచమురు ధరలు భారీగా పతనమవడం గమనార్హం. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర వంద డాలర్ల కంటే కిందికి పడిపోయింది. దాదాపు 4.75 శాతం క్షీణతతో బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 98.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర కూడా 4.76 శాతం తగ్గి 92.00 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నా దేశీయంగా పెంచడంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఉన్నందున దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంకా నష్టాల్లోనే నడుస్తున్నాయి. కంపెనీలకు లీటర్ పెట్రోల్‌పై పది రూపాయలు, డీజిల్‌పై పదమూడు రూపాయల వరకు నష్టం వస్తోందని ఈ నివేదిక పేర్కొంది. మే 2022 తర్వాత ఇంధన ధరలు ఈ స్థాయిలో గరిష్ట రికార్డుకు చేరడం ఇదే తొలిసారి. మరోవైపు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాహన ఇంధనమైన సీఎన్‌జీ ధరను కూడా ఢిల్లీలో కేజీకి రూ.81.09లకు పెంచింది. పది రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ధర పెరగడం ఇది మూడోసారి.

దేశంలో కొన్ని చోట్ల ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పందించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలకు ఎలాంటి కొరత లేదని సంస్థ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న ఇబ్బందులు కేవలం తాత్కాలికమైనవని, స్థానిక కారణాల వల్లే అలా జరిగిందని తెలిపింది. గతేడాదితో పోలిస్తే మే నెలలో పెట్రోల్ విక్రయాలు 14 శాతం, డీజిల్ విక్రయాలు 18 శాతం మేర పెరిగాయని కంపెనీ వెల్లడించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story