Petrol Prices Today : ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? నేడు మీ సిటీలో పెట్రోల్, డీజిల్ లేటెస్ట్ రేట్లు ఇవే!
Petrol Prices Today : జూన్ 13న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.69 గా ఉంది. బల్క్ వినియోగదారులపై కేంద్రం ఆంక్షలు విధించింది.
Petrol Prices Today
Petrol Prices Today : ఉదయం వాహనాలతో బయటకు వెళ్లే వారికి, పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపుకోవాలనుకునే వారికి చమురు కంపెనీలు తాజా రేట్లను విడుదల చేశాయి. జూన్ 13వ తేదీ శనివారం నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఇరాన్ దేశంలో జరుగుతున్న అంతర్గత సంఘర్షణలు, అలాగే హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో భారీ మార్పులు వస్తున్నాయి. ఈ గ్లోబల్ టెన్షన్ల ప్రభావం దేశీయంగా ఇంధన రేట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.
పెట్రోల్ బంకులపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆంక్షలు
ఇంధన మార్కెట్లో రేట్ల తేడాల వల్ల వస్తున్న సమస్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం.. భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పెద్ద పెద్ద విద్యాసంస్థలు తమ వాహనాల కోసం సాధారణ పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని కేవలం బల్క్ సేల్ పాయింట్స్ నుంచే నేరుగా కొనుగోలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వార్తా సంస్థ పిటిఐ నివేదిక ప్రకారం.. ఈ కఠినమైన ఆంక్షలు రాబోయే 90 రోజుల పాటు అమలులో ఉంటాయి.
రేట్ల తేడాల వల్లే ఈ నిర్ణయం
ప్రభుత్వం ఈ రకమైన పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. సాధారణ రీటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే ధరల కంటే, బల్క్ మార్కెట్లో కంపెనీలు విక్రయించే ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీలోని సాధారణ పెట్రోల్ బంకుల్లో లీటర్ డీజిల్ ధర రూ.95.20గా ఉంటే, అదే డీజిల్‌ను బల్క్ మార్కెట్లో కొంటే లీటరుకు రూ.134.50 గా ఉంది. ఈ భారీ ధరల వ్యత్యాసాన్ని గమనించిన పెద్ద పెద్ద కమర్షియల్ కస్టమర్లు.. బల్క్ మార్కెట్ మానేసి నార్మల్ పెట్రోల్ బంకులకు వచ్చి డీజిల్ కొనడం ప్రారంభించారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో సాధారణ బంకుల్లో డీజిల్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగి కొరత ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. అందుకే ప్రభుత్వం ఈ చెక్ పెట్టింది.
గత నాలుగేళ్లలో గరిష్ట స్థాయికి చేరిన ఇంధన రేట్లు
గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తాము ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఆ భారాన్ని కస్టమర్ల పైకి నెట్టడం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే గత మే 25వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2.50 కంటే ఎక్కువగా పెంచాయి. మే 15వ తేదీ నుండి లెక్కిస్తే కేవలం కొన్ని రోజుల్లోనే లీటరుకు ఏకంగా రూ.7.50 వరకు బాదేశారు. ఫలితంగా ప్రస్తుతం భారతదేశంలో ఇంధన ధరలు గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గత రెండేళ్ల కాలంలో, మార్చి 2024 లో కేవలం రూ.2 మాత్రమే తగ్గించారు, ఆ తర్వాత రేట్లు ఎక్కువగా స్థిరంగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం భారీగా పెరిగిపోయాయి.
దేశంలోని లేటెస్ట్ సిటీ వైజ్ రేట్లు
ప్రస్తుతం మన భాగ్యనగరం హైదరాబాద్‌లో ఇంధన ధరలు దేశంలోని మిగిలిన మెట్రో నగరాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 వద్ద విక్రయించబడుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ.103.82 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.111.18 కాగా, డీజిల్ ధర రూ.97.83 గా నమోదైంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.113.47, డీజిల్ రూ.99.82 గా ఉంది. చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ రూ.107.77 గా, డీజిల్ రూ.99.55 గా విక్రయించబడుతోంది. పాట్నాలో పెట్రోల్ రూ.113.35, జైపూర్‌లో రూ.112.66, భోపాల్‌లో రూ.114.54 గా రేట్లు ఉన్నాయి. దేశంలోనే అత్యంత తక్కువగా పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ రూ.88.66, డీజిల్ రూ.84.56 కే లభిస్తోంది.
రేపు ముంబైలో చౌకగా పెట్రోల్ ఆఫర్
మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో నివసించే టూవీలర్ వాహనదారులకు ఒక క్రేజీ అప్‌డేట్ అందింది. జూన్ 14వ తేదీన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ ఠాకరే 58వ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ ఒక వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. ముంబై వ్యాప్తంగా ఉన్న టూవీలర్ రైడర్లకు రాయితీ ధరలకే పెట్రోల్ అందించనున్నారు. దీని కోసం ఎమ్‌ఎన్ఎస్ పార్టీ ముంబై నగరవ్యాప్తంగా ఉన్న సుమారు 36 పెట్రోల్ బంకులతో ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచిఈ డిస్కౌంట్ పెట్రోల్ సదుపాయం అందుబాటులోకి రానుంది. అయితే ఈ సూపర్ ఆఫర్ కేవలం ముంబై నగర పరిధిలోని బైకర్లకు మాత్రమే వర్తిస్తుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.




