Petrol-Diesel Price : రెండేళ్ల గరిష్టానికి ఇంధన ధరలు.. ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే ..?

Petrol-Diesel Price : దేశంలో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల రెండేళ్ల గరిష్టానికి చేరిన ఇంధన ధరలు రాబోయే రోజుల్లో తగ్గుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.

CR Reddy
Published on: 14 Jun 2026 8:34 AM IST
Petrol-Diesel Price
X

Petrol-Diesel Price

Petrol-Diesel Price : దేశంలో ఆదివారం (జూన్ 14, 2026) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా మే 25వ తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ రెండింటిపై దాదాపు రూ.2.50 పైగా భారీగా ధరలను పెంచాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఇంధన ధరలు మే 2022 తర్వాత చూసుకుంటే దేశంలోనే అత్యంత గరిష్ట స్థాయికి చేరడం గమనార్హం. గడచిన మే 15వ తేదీ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మొత్తంగా లీటరుకు రూ.7.50 పైగా పెరిగాయి. మార్చి 2024 లో సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.2 తగ్గించిన విషయాన్ని మినహాయిస్తే.. దాదాపు రెండేళ్లకు పైగా ధరలు అదుపులోనే ఉన్నాయి. కానీ ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు రెక్కలు రావడంతో దేశీయంగా కూడా ఇంధన భారం ఒక్కసారిగా పెరిగిపోయి సామాన్యుడిపై మోయలేని భారంగా మారింది.

ఇంధన ధరలు పెరగడానికి అసలు కారణం ఇదే

ప్రస్తుతం చమురు ధరలు ఇంతలా పెరగడానికి ముఖ్య కారణం గల్ఫ్ దేశాలైన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణమే. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే గ్యాస్, ఆయిల్ రవాణాలో ఈ మార్గం ఎంతో కీలకం కావడంతో అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా నిలిచిపోయి రేట్లు భారీగా పెరిగాయి. అయితే తాజాగా అమెరికా, ఇరాన్ దేశాలు హోర్ముజ్ జలసంధిని మళ్లీ తెరవడానికి ఒక శాంతి ఒప్పందానికి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ఊరట.. కేంద్ర మంత్రి భరోసా

ఈ విషయమై కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ వచ్చే కొద్ది నెలల్లోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ భారతదేశం వద్ద దేశీయ అవసరాలకు సరిపడా అదనపు చమురు నిల్వలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్ ధరలు ఎక్కువ కాలం పాటు ఇంత గరిష్ట స్థాయిలో ఉండలేవని, కెనడా, అమెరికా దేశాల నుంచి భారత్‌కు అదనపు ఆయిల్ సరఫరా అందుతుందని, దీనివల్ల త్వరలోనే ధరలు దిగివస్తాయని రాయటర్స్ నివేదిక ద్వారా ఆయన హామీ ఇచ్చారు.

వివిధ నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలోని ప్రధాన నగరాలలో లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.12 కాగా డీజిల్ రూ.95.20 గా ఉంది.హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 115.69, డీజిల్ ధర రూ. 103.82గా ఉంది. భోపాల్‌లో పెట్రోల్ రూ.114.54, డీజిల్ రూ.99.64 వద్ద కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ రూ.111.18, డీజిల్ రూ.97.83 లుగా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.113.47 కాగా, డీజిల్ రూ.99.82 ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.107.77 గా, డీజిల్ రూ.99.55 లుగా విక్రయించబడుతోంది. అత్యంత తక్కువగా పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ రూ.88.66, డీజిల్ రూ.84.56 ల వద్ద లభిస్తోంది. స్థానిక పన్నుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story