UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ బంద్..?

UPI Payments: డిజిటల్ పేమెంట్స్ నిలిపివేస్తామంటున్న పెట్రోల్ డీలర్లు.

Gagan kumar
Published on: 19 Sept 2026 7:40 AM IST
UPI Payments
X

UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ బంద్..? 

UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీలకు సంబంధించి వచ్చిన తాజా వార్త వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పాకెట్ లో చిల్లర లేకపోయినా, ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇంధనం కొనుగోలు చేస్తున్న డిజిటల్ యుగంలో.. ఇప్పుడు ఈ సరికొత్త నిబంధన పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సవరించిన నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి పెట్రోల్ బంకుల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ఇంధనాన్ని యూపీఐ ద్వారా చెల్లిస్తే ప్రతి లావాదేవీపై రూ. 5 ఫ్లాట్ మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించనుంది. అయితే, రూ.2,000 కంటే తక్కువ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ ఉండదు.

పెట్రోల్ బంక్ నిర్వాహకులకు లీటరు ఇంధనంపై లభించే కమీషన్ కేవలం రూ.2.40 నుంచి రూ.3.40 మధ్య మాత్రమే ఉంటుంది. ఇంధన ధరల నిర్ణయాధికారం డీలర్ల చేతుల్లో ఉండదు. ఇలాంటి తరుణంలో ప్రతి పెద్ద లావాదేవీపై రూ. 5 చొప్పున కోత పడితే తమ వ్యాపార లాభాలు (మార్జిన్లు) పూర్తిగా కనుమరుగవుతాయని పెట్రోలియం డీలర్లు వాపోతున్నారు.

ఈ కొత్త MDR భారాన్ని తాము మోయలేమని, కేంద్రాన్ని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా పెట్రోల్ పంపులకు మినహాయింపు ఇవ్వాలని **ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్ డిమాండ్ చేస్తోంది.

ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ముంబై, కర్ణాటక, రాజస్థాన్, జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ట్రాల డీలర్లు ఈ నిబంధనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్టోబర్ 15 నాటికి తమ డిమాండ్ నెరవేరకపోతే.. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే యూపీఐ డిజిటల్ చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి, కేవలం నగదు లావాదేవీలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

కార్లు, కమర్షియల్ వాహనాలు, బైకులు లాంటి వాటికి ఫుల్ ట్యాంక్ కొట్టించుకునే క్రమంలో మెజారిటీ వాహనదారులు రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికే ఇంధనం కొనుగోలు చేస్తుంటారు. ఒకవేళ డీలర్లు నిజంగానే యూపీఐ సేవలను నిలిపివేస్తే.. సామాన్య ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. జేబులో పర్సు లేక కేవలం మొబైల్ పై ఆధారపడేవారికి ఇది పెద్ద షాకే అవుతుంది.

మరోవైపు, ఈ MDR రుసుము పూర్తిగా వ్యాపారులకు వర్తించేదేనని, ఈ భారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులపై వేయకూడదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయకుండా పర్యవేక్షించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక వ్యవస్థను కూడా సిద్ధం చేస్తోంది.

మరి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని డీలర్ల సమస్యను పరిష్కరిస్తుందా? లేక అక్టోబర్ 15 నుంచి పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులకు బ్రేక్ పడుతుందా? వేచి చూడాల్సిందే.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.