PM Kisan: రైతుల ఖాతాల్లోకి నేడు రూ.2,000.. మీకు డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ పథకం 24వ విడత కింద రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ చేయనున్నట్లు సమాచారం. మొత్తం 9.34 కోట్ల మంది రైతులకు రూ.18,680 కోట్లు విడుదల చేయనున్నారు.
PM Kisan
PM Kisan: దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 30) 24వ విడత నిధులను విడుదల చేయనుంది. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్ల మందికి పైగా అర్హులైన రైతులకు రూ.18,690 కోట్లకు పైగా నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఒక్కో రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున అందనున్నాయి. అయితే నిధులు విడుదలైన వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు కనిపించకపోవచ్చు. బ్యాంకు లావాదేవీల ప్రక్రియను బట్టి జమ కావడానికి కొంత సమయం పట్టవచ్చు.
ఇప్పటివరకు రూ.4.47 లక్షల కోట్ల పంపిణీ
పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా, ఒక్కోసారి రూ.2,000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు 23 విడతల్లో కలిపి రూ.4.47 లక్షల కోట్లకు పైగా రైతులకు అందించారు. తాజాగా విడుదల కానున్నది 24వ విడత. ఈసారి 9.34 కోట్ల మందికి పైగా రైతులకు సాయం అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అయితే పథకానికి నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ డబ్బులు వస్తాయని భావించకూడదు. అర్హత, భూమి వివరాల పరిశీలన, ఈకేవైసీ వంటి అంశాల ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి.
మీ ఖాతాలో రూ.2,000 పడతాయో లేదో ఇలా చెక్ చేయండి
పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు మీకు వస్తాయా లేదా అనేది ఇంటి దగ్గర నుంచే తెలుసుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో కనిపించే Farmers Corner విభాగంలో Know Your Status ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ అడిగిన వివరాల ప్రకారం మీ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. నంబర్ తెలియకపోతే అందుబాటులో ఉన్న వివరాలతో దాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం క్యాప్చా నమోదు చేసి, ‘Get OTP’పై క్లిక్ చేయాలి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వివరాలు పొందాలి. అక్కడ మీ లబ్ధిదారుడి స్థితి, విడతల చెల్లింపుల సమాచారం కనిపిస్తుంది. 24వ విడత చెల్లింపు వివరాలను పరిశీలించి డబ్బులు జమయ్యాయా లేదా తెలుసుకోవచ్చు.
ఈకేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు ఆగిపోవచ్చు
పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఈకేవైసీ తప్పనిసరి. ఇది పూర్తి చేయని రైతులకు చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంది. అధికారిక వెబ్సైట్ లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఆధార్ ఓటీపీతో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ముఖ గుర్తింపు సదుపాయం ద్వారా కూడా ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉంది. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ విధానంలోనూ పూర్తి చేయవచ్చు. ఆధార్ నంబర్, దానికి అనుసంధానమైన మొబైల్ నంబర్ దగ్గర ఉంచుకోవాలి. ఈకేవైసీతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ అనుసంధానం, భూమి రికార్డుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి.
ఈ రైతులకు 24వ విడత డబ్బులు నిలిచిపోయే అవకాశం
భూమి యాజమాన్య వివరాల్లో తేడాలు ఉన్నా, పథకం నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయోజనం పొందుతున్నట్లు గుర్తించినా చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి యాజమాన్యం పొందిన కొన్ని కేసులు, ఒకే కుటుంబంలో పలువురు లబ్ధిదారులుగా నమోదైన అనుమానాస్పద కేసులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి రైతులు అధికారిక వెబ్సైట్లో ‘Know Your Status’ ద్వారా తమ వివరాలు చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య కనిపిస్తే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలు సరిచేసుకోవాలి. కాబట్టి రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులు ఈరోజే తమ పేమెంట్ స్టేటస్, ఈకేవైసీ వివరాలు పరిశీలించుకోవడం మంచిది.




