PMJAY: ఆయుష్మాన్ భారత్ ప్రభావం.. ప్రజల జేబు నుంచి వైద్య ఖర్చులు తగ్గాయ్!
ఆయుష్మాన్ భారత్ పథకం కింద 12.69 కోట్ల నగదురహిత చికిత్సలు అందాయి. రూ.1.92 లక్షల కోట్ల విలువైన వైద్య సేవలు లబ్ధిదారులకు చేరాయి.
Ayushman Bharat
ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12.69 కోట్ల నగదురహిత ఆస్పత్రి చికిత్సలకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ చికిత్సల మొత్తం విలువ రూ.1.92 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. జూన్ 30 నాటికి 37,413 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నెట్‌వర్క్ ద్వారా ఈ సేవలు అందించబడినట్లు పేర్కొంది.
రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ పథకం కింద దేశంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 12 కోట్ల కుటుంబాలకు ప్రతి ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ద్వితీయ, తృతీయ స్థాయి ఆస్పత్రి చికిత్సలకు ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ పథకం అమలుతో ప్రజలు తమ జేబు నుంచి వైద్య ఖర్చులు భరించే భారం గణనీయంగా తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనాల (2022–23) ప్రకారం మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజలు స్వయంగా భరించే ఖర్చు 2014–15లో 62.6 శాతం ఉండగా, 2022–23 నాటికి అది 43.4 శాతానికి తగ్గిందని వివరించారు.
ప్రభుత్వం ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెంచడం, ఏబీ-పీఎంజేఏవై వంటి ప్రభుత్వ నిధులతో అమలయ్యే ఆరోగ్య బీమా పథకాలను విస్తరించడం వల్ల ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు.
2024 మార్చిలో ఈ పథకాన్ని ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకుల సుమారు 37 లక్షల కుటుంబాలకు విస్తరించినట్లు ప్రభుత్వం గుర్తుచేసింది. అనంతరం 2024 అక్టోబర్‌లో 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల మంది వృద్ధులను, 4.5 కోట్ల కుటుంబాలను వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఈ పథకంలో చేర్చినట్లు వెల్లడించింది.
ఇక వైద్య పరిశోధనలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు 2024–25 బడ్జెట్‌లో రూ.2,732.13 కోట్లు కేటాయించగా, 2025–26లో అది రూ.3,125.50 కోట్లకు పెరిగింది. 2026–27 బడ్జెట్‌లో ఐసీఎంఆర్‌కు రూ.4,000 కోట్ల కేటాయింపు చేయడం ద్వారా గత ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే సుమారు 21 శాతం పెరుగుదల నమోదైంది.




