Post Office: పోస్టాఫీస్ ATM వినియోగదారులకు అలర్ట్.. నగదు ఉపసంహరణపై కొత్త నిబంధనలు!

Post Office: పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) ఉన్నవారు ATM కార్డు ద్వారా డబ్బులు తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన నిబంధనలు తెలుసుకోవాలి.

Mokshith
Published on: 10 Nov 2026 2:36 PM IST
Post Office
X

Post Office: పోస్టాఫీస్ ATM వినియోగదారులకు అలర్ట్.. నగదు ఉపసంహరణపై కొత్త నిబంధనలు!

Post office: పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) ఉన్నవారు ATM కార్డు ద్వారా డబ్బులు తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన నిబంధనలు తెలుసుకోవాలి. ఒక రోజులో ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు? ఒక్కో లావాదేవీకి ఎంత పరిమితి ఉంది? నెలకు ఎన్ని ఉచిత ట్రాన్సాక్షన్లు ఉంటాయి? పరిమితి దాటితే ఎంత ఛార్జీ చెల్లించాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రోజుకు ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు?

తపాలా శాఖ నిబంధనల ప్రకారం పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా ATM కార్డు ద్వారా ఒక రోజులో గరిష్ఠంగా రూ.25,000 వరకు నగదు తీసుకోవచ్చు. అయితే ఒక్కో ట్రాన్సాక్షన్ ద్వారా గరిష్ఠంగా రూ.10,000 మాత్రమే విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక రోజులో రూ.25,000 తీసుకోవాలంటే మూడు విడతల్లో లావాదేవీలు చేయాలి. మొదట రూ.10,000, రెండోసారి రూ.10,000, మూడోసారి రూ.5,000 తీసుకోవచ్చు. అదే సమయంలో ఖాతాలో కనీసం రూ.500 నిల్వ ఉండేలా చూసుకోవాలి. అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ కంటే ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ తిరస్కరణకు గురవుతుంది.

నెలకు ఎన్ని ATM ట్రాన్సాక్షన్లు ఉచితం?

పోస్టాఫీస్ ATM కార్డు ద్వారా సొంత పోస్టాఫీస్ ATMలు, ఇతర బ్యాంకుల ATMల్లో నగదు విత్‌డ్రా చేయవచ్చు. అయితే వీటికి ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితులు వేర్వేరుగా ఉంటాయి. పోస్టాఫీస్ ATMల్లో నెలకు 5 ఉచిత ట్రాన్సాక్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో నగదు ఉపసంహరణతో పాటు బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్ వంటి లావాదేవీలు కూడా ఉంటాయి.

ఇతర బ్యాంకుల ATMల్లో ఆరు మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర ప్రాంతాల్లో నెలకు 5 ఉచిత ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. ఈ లెక్కలో నగదు విత్‌డ్రా చేయడం మాత్రమే కాకుండా బ్యాలెన్స్ చెక్ చేయడం, మినీ స్టేట్‌మెంట్ తీసుకోవడం వంటి నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు కూడా చేరుతాయి.

ఉచిత పరిమితి దాటితే ఎంత ఛార్జీ పడుతుంది?

నెలకు అందుబాటులో ఉన్న ఉచిత ATM ట్రాన్సాక్షన్ల పరిమితి పూర్తయిన తర్వాత చేసే లావాదేవీలకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 2025 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఛార్జీల ప్రకారం.. నగదు విత్‌డ్రా వంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.23 + GST. బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్ వంటి నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.11 + GST. అందువల్ల ఉచిత లావాదేవీల పరిమితిని ముందుగానే గుర్తుంచుకోవాలి. అవసరం లేకుండా పదేపదే ATMలను ఉపయోగిస్తే అదనపు ఛార్జీల భారం పడుతుంది.

ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి? వడ్డీ ఎలా లెక్కిస్తారు?

పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ.500 బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న ఖాతాలో రూ.500 కంటే తక్కువ మొత్తం ఉంటే రూ.50 నిర్వహణ ఛార్జీ కట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖాతాలో కనీస నిల్వ ఉండేలా చూసుకోవాలి.

ఇక పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీని ప్రతి నెలా 10వ తేదీ నుంచి ఆ నెల చివరి రోజు వరకు ఉన్న కనీస బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఈ వడ్డీని ఏడాదికి ఒకసారి ఖాతాలో జమ చేస్తారు. అందువల్ల నెల మధ్యలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునే ముందు వడ్డీ లెక్కింపుపై కూడా అవగాహన ఉండాలి. మొత్తంగా.. పోస్టాఫీస్ ATM కార్డు వినియోగదారులు రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి, ఒక్కో ట్రాన్సాక్షన్ పరిమితి, ఉచిత లావాదేవీల సంఖ్య, కనీస బ్యాలెన్స్ నిబంధనలను గుర్తుంచుకోవాలి. వీటిని పాటిస్తే అనవసరమైన ATM ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.