Post Office: ఒక్కసారి డబ్బు పెడితే చాలు.. మీ అకౌంట్‌లో ప్రతి నెలా రూ.5,500 పడతాయి!

Post Office: డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టి ప్రతి నెలా కొంత ఆదాయం పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Mokshith
Published on: 1 Oct 2026 4:07 PM IST
Post Office
X

Post Office: ఒక్కసారి డబ్బు పెడితే చాలు.. మీ అకౌంట్‌లో ప్రతి నెలా రూ.5,500 పడతాయి!

Post Office: డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టి ప్రతి నెలా కొంత ఆదాయం పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఇందులో ప్రతినెలా కొత్తగా డబ్బు జమ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి పెట్టుబడి పెట్టి, ఆ మొత్తంపై వచ్చే వడ్డీని నెలనెలా ఆదాయంగా పొందవచ్చు.

ఒక్కసారి పెట్టుబడి.. నెలనెలా ఆదాయం

పోస్టాఫీస్ MIS పథకంలో ఒకేసారి మొత్తం డబ్బును డిపాజిట్ చేయాలి. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతి నెలా ఖాతాదారుడికి చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ పథకానికి 7.40 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తోంది. ఖాతా కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ పథకంలో కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు సింగిల్ ఖాతా తెరవవచ్చు. అవసరాన్ని బట్టి జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఒక జాయింట్ ఖాతాలో గరిష్టంగా ముగ్గురు పెద్దలు ఉండవచ్చు.

రూ.9 లక్షలు పెడితే నెలకు రూ.5,500

సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం 7.40 శాతం వార్షిక వడ్డీ ప్రకారం రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి రూ.66,600 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.5,550 చొప్పున వడ్డీ ఆదాయం లభిస్తుంది.

జాయింట్ ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. అదే 7.40 శాతం వడ్డీ రేటు కొనసాగితే సంవత్సరానికి రూ.1,11,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.9,250 వరకు వడ్డీ ఆదాయం పొందవచ్చు. అయితే వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారే అవకాశం ఉండటంతో పెట్టుబడి సమయంలో అమల్లో ఉన్న రేటును తప్పనిసరిగా పరిశీలించాలి.

మధ్యలో ఖాతా మూసేస్తే ఏం జరుగుతుంది?

MIS ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ముందుగానే ఖాతాను మూసివేసే అవకాశం ఉంది. సాధారణంగా ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 1 సంవత్సరం పూర్తయ్యే వరకు ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉండదు. 1 నుంచి 3 సంవత్సరాల మధ్య ఖాతాను మూసివేస్తే డిపాజిట్ మొత్తంలో 2 శాతం తగ్గింపు వర్తిస్తుంది. 3 సంవత్సరాలు పూర్తైన తర్వాత 5 సంవత్సరాల లోపు ఖాతాను మూసివేస్తే 1 శాతం తగ్గింపు ఉంటుంది. ఖాతాదారు మరణించిన సందర్భంలో నిబంధనల ప్రకారం ఖాతాను మూసివేసి, సంబంధిత మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు.

పోస్టాఫీస్‌లోనే సులభంగా ఖాతా ప్రారంభించవచ్చు

MIS ఖాతా ప్రారంభించడానికి సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు. దరఖాస్తు ఫారం, KYC వివరాలు, PAN కార్డు కాపీతో పాటు పోస్టాఫీస్ కోరే ఇతర పత్రాలను సమర్పించాలి. అవసరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకేసారి పెట్టుబడి మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. నెలవారీ ఖర్చులకు స్థిరమైన ఆదాయం అవసరమైనవారు, పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా డబ్బు రావాలని కోరుకునేవారు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.

అయితే పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు, డిపాజిట్ పరిమితులు, ముందస్తు విత్‌డ్రా నిబంధనలు వంటి వివరాలను పోస్టాఫీస్‌లో నిర్ధారించుకోవడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.