నెల‌కు రూ. 3500 పొదుపు చేస్తే రూ. 8.12 ల‌క్ష‌లు పొందొచ్చు.. అద‌నంగా బీమా ర‌క్ష‌ణ కూడా

Post Office Scheme: భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు పొదుపు చేయడంతో పాటు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని చాలామంది భావిస్తుంటారు.

Mokshith
Published on: 8 Nov 2026 3:39 PM IST
Post Office Scheme
X

నెల‌కు రూ. 3500 పొదుపు చేస్తే రూ. 8.12 ల‌క్ష‌లు పొందొచ్చు.. అద‌నంగా బీమా ర‌క్ష‌ణ కూడా

Post Office Scheme: భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు పొదుపు చేయడంతో పాటు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని చాలామంది భావిస్తుంటారు. అలాంటి వారికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI) పథకం ఉపయోగకరమైన ఆప్షన్‌గా చెప్పొచ్చు.

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం అంటే ఏంటి?

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తపాలా శాఖ అందిస్తున్న జీవిత బీమా పథకం. ఇందులో పాలసీదారుడు నిర్ణీత కాలం పాటు ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి. పాలసీ గడువు పూర్తయినప్పుడు బీమా మొత్తంతో పాటు అప్పటివరకు వర్తించే బోనస్ కూడా పొందవచ్చు. ఒకవేళ పాలసీ కాలంలో పాలసీదారుడు మరణిస్తే, నిబంధనల ప్రకారం నామినీ లేదా కుటుంబ సభ్యులకు బీమా ప్రయోజనం అందుతుంది. ఇలా పొదుపుతో పాటు కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడం ఈ పథకం ప్రత్యేకత.

నెలకు రూ.3,500 చెల్లిస్తే ఎంత వస్తుంది?

రూ.5 లక్షల బీమా మొత్తంతో 12 ఏళ్ల కాలపరిమితికి పాలసీ తీసుకుంటే నెలకు సుమారు రూ.3,500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ గడువు పూర్తయ్యే సమయానికి సుమారు రూ.8.12 లక్షలు అందే అవకాశం ఉంది. ఇందులో రూ.5 లక్షలు అసలు బీమా మొత్తం కాగా, మరో రూ.3.12 లక్షలు బోనస్ రూపంలో లభిస్తాయి. అంటే బీమా రక్షణతో పాటు దీర్ఘకాలిక పొదుపు ప్రయోజనం కూడా పొందవచ్చు. అయితే బోనస్ మొత్తం అప్పటికి ప్రకటించిన రేట్లు, పాలసీ నిబంధనలపై ఆధారపడి మారుతుంది.

ఎవరు అర్హులు.?

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకంపై యువత కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తక్కువ ప్రీమియంతో బీమా రక్షణ పొందడంతో పాటు భవిష్యత్తు కోసం డబ్బు కూడబెట్టుకోవచ్చనేది దీనికి ప్రధాన కారణం.

ఈ పథకం నిబంధనల ప్రకారం 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న అర్హులు పాలసీ తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు కొన్ని ప్రత్యేక అర్హతలు వర్తిస్తాయి. కాబట్టి వయసుతో పాటు ఉద్యోగం, వృత్తి, ఇతర అర్హతలను కూడా పోస్టాఫీసులో నిర్ధారించుకోవాలి.

పాలసీ తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి

ఈ పథకంలో అర్హత కలిగిన పాలసీదారులకు ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. బీమా రక్షణ, పొదుపు, బోనస్ ప్రయోజనాలు ఒకే పథకంలో లభించడం దీని ప్రత్యేకత. అయితే పాలసీ తీసుకునే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెలవారీ ప్రీమియం ఎంత? మొత్తం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? గడువు పూర్తయ్యాక ఎంత మొత్తం వస్తుంది? మధ్యలో పాలసీని నిలిపివేస్తే ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి? పన్ను మినహాయింపులు ఎలా ఉంటాయి? అనే వివరాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా బోనస్ మొత్తం స్థిరంగా ఉంటుందని భావించకూడదు. తాజా బోనస్ రేట్లు, పాలసీ నిబంధనలను సమీపంలోని పోస్టాఫీసులో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.