Post Office: రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెల రూ. 20,500 ఆదాయం పొందాలా.? ఇలా చేస్తే సాధ్యమే
Post Office: రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండాలని చాలా మంది కోరుకుంటారు.
Post Office: రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెల రూ. 20,500 ఆదాయం పొందాలా.? ఇలా చేస్తే సాధ్యమే
Post Office: రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. నెలవారీ జీతం ఆగిపోవడంతో ఖర్చులు ఎలా నిర్వహించాలనే ఆందోళన సహజం. అలాంటి వారికి పోస్టాఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మంచి పెట్టుబడి ఎంపికగా చెప్పవచ్చు.
రిటైర్మెంట్ తర్వాత ఆదాయానికి మంచి ఎంపిక
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రత్యేకంగా వృద్ధుల కోసం రూపొందించిన ప్రభుత్వ పొదుపు పథకం. ఇందులో కేవలం రూ.1,000తో కూడా ఖాతా ప్రారంభించవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేస్తారు. దీంతో రోజువారీ ఖర్చులు, మందులు, ఇతర అవసరాల కోసం క్రమం తప్పకుండా ఆదాయం అందుతుంది. ప్రభుత్వ హామీ ఉన్న పథకం కావడంతో పెట్టుబడి భద్రతపై ఆందోళన అవసరం ఉండదు.
ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తోంది?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికి (ఏప్రిల్–జూన్ 2026) చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో SCSSపై సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ కొనసాగుతోంది. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. గడువు పూర్తయిన తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో, ఖాతా మూసివేసే వరకు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా నిబంధనల ప్రకారం వడ్డీ చెల్లిస్తారు.
ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు? నిబంధనలు ఏంటి?
ఈ పథకంలో సాధారణంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్న వారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉన్నా కొన్ని నిబంధనల మేరకు అర్హులు. రిటైర్డ్ రక్షణ సిబ్బందికి కనీస వయసు 50 సంవత్సరాలుగా నిర్ణయించారు. భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవవచ్చు. ఖాతా ప్రారంభించడానికి ఆధార్ తప్పనిసరి. గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే పెట్టుబడి మొత్తం రూ.1,000 గుణకాల్లో మాత్రమే జమ చేయాలి. నిర్ణయించిన పరిమితికి మించి డబ్బు జమైతే అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
నెలకు రూ.20,500 ఆదాయం ఎలా వస్తుంది?
ప్రస్తుతం SCSSపై 8.2 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకంలో గరిష్ఠ పరిమితి అయిన రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి సుమారు రూ.2,46,000 వడ్డీ వస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారీగా లెక్కిస్తే దాదాపు రూ. 20,500 పొందొచ్చు. వాస్తవానికి వడ్డీని పోస్టాఫీస్ ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. అంటే లబ్ధిదారుడికి మూడు నెలలకు ఒకసారి రూ. 61500 లభిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత క్రమమైన ఆదాయం కోరుకునే వారికి ఈ ప్రభుత్వ పథకం సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.




