Post Office: 5 ఏళ్లలో రూ. 6 లక్షల వడ్డీ.. పోస్టాఫీస్ పథకంతో బిందాస్!
Post Office: పదవీ విరమణ తర్వాత చేతిలో ఉన్న డబ్బుకు భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం కూడా ఉండాలని చాలామంది కోరుకుంటారు.
Post Office: 5 ఏళ్లలో రూ. 6 లక్షల వడ్డీ.. పోస్టాఫీస్ పథకంతో బిందాస్!
Post Office: పదవీ విరమణ తర్వాత చేతిలో ఉన్న డబ్బుకు భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం కూడా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారికి పోస్టాఫీసు అందించే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒక మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏమిటి?
పదవీ విరమణ తర్వాత తమ దగ్గర ఉన్న పొదుపును భద్రంగా ఉంచుకోవాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ పథకంలో ఖాతా తెరవవచ్చు. కొన్ని నిబంధనలకు లోబడి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు 55 ఏళ్ల తర్వాత, రక్షణ రంగం నుంచి పదవీ విరమణ చేసిన వారికి 50 ఏళ్ల తర్వాత కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.
ఈ పథకం ప్రారంభ గడువు ఐదేళ్లు. ఇందులో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ.30 లక్షలు. పదవీ విరమణ ప్రయోజనాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టి, క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం పొందాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
ఏడాదికి 8.2 శాతం వడ్డీ.. ప్రతి మూడు నెలలకు ఆదాయం
ఈ పథకంలో ప్రస్తుతం ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందుతోంది. వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. దీంతో పెట్టుబడిదారులు తమ రోజువారీ అవసరాలు, మందుల ఖర్చులు, ఇంటి నిర్వహణ వంటి వాటికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.1,23,000 వడ్డీ లభిస్తుంది.
అంటే ప్రతి మూడు నెలలకు రూ.30,750 చొప్పున అందుతుంది. అయితే వడ్డీ రేట్లు ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా మారవచ్చు. ఈ పథకంలో ఖాతా తెరిచే సమయంలో వర్తించే నిబంధనలు, వడ్డీ రేటును పోస్టాఫీసులో నిర్ధారించుకోవడం మంచిది. పన్ను విషయానికి వస్తే, అర్హత ఉన్న పెట్టుబడులకు సెక్షన్ 80C కింద మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది. అయితే పాత పన్ను విధానంలో వర్తించే అర్హతలు, ప్రస్తుత పన్ను నిబంధనలను పరిశీలించాలి. వడ్డీ ఆదాయం పన్నుకు లోబడి ఉండవచ్చు.
రూ.15 లక్షలు పెడితే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ప్రస్తుత 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు ఆధారంగా రూ.15 లక్షల పెట్టుబడికి లెక్కలు ఇలా ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.15,00,000 అయితే ఏడాదికి వడ్డీ రూ.1,23,000 వడ్డీ లభిస్తుంది. అంటే ప్రతి మూడు నెలలకు రూ.30,750 వడ్డీ రూపంలో పొందొచ్చు. ఇలా 5 ఏళ్లలో మొత్తం వడ్డీ రూ.6,15,000 అవుతుంది. దీంతో అసల, వడ్డీ రెండూ కలిపి రూ. 21,15,000 చేతికి వస్తుంది.
ఐదేళ్ల తర్వాత పొడిగించుకోవచ్చా?
ఈ పథకం సాధారణంగా ఐదేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అయితే పెట్టుబడిని కొనసాగించాలనుకునే వారికి నిబంధనల ప్రకారం మరో మూడు సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మెచ్యూరిటీ తర్వాత నిర్ణీత గడువులో దరఖాస్తు చేయాలి. పొడిగించిన ఖాతాకు వర్తించే వడ్డీ రేటు సంబంధిత నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు.
కాబట్టి మెచ్యూరిటీ సమయానికి పోస్టాఫీసును సంప్రదించి తాజా వివరాలు తెలుసుకోవాలి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు మీకు అవసరమైన నగదు, ఇతర ఆదాయ మార్గాలు, పన్ను బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తంగా చూస్తే, పదవీ విరమణ తర్వాత పొదుపును క్రమబద్ధంగా నిర్వహించుకోవాలనుకునే సీనియర్ సిటిజన్లకు SCSS ఉపయోగకరమైన పథకం.




