Post Office: రూపాయికి రూపాయి గ్యారెంటీ..పోస్టాఫీస్ సూపర్ హిట్ స్కీమ్స్ ఇవే..!
Post Office: 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి.
Post Office: రూపాయికి రూపాయి గ్యారెంటీ..పోస్టాఫీస్ సూపర్ హిట్ స్కీమ్స్ ఇవే..!
Savings Schemes : ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టడానికి మార్కెట్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ, అందరికీ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి చోట్ల డబ్బులు పెట్టడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ లాభాలు ఎంత ఎక్కువగా ఉంటాయో, రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. రూపాయి నష్టం లేకుండా, పెట్టిన పెట్టుబడికి ఖచ్చితమైన లాభం రావాలని కోరుకునే సాంప్రదాయ పెట్టుబడిదారులకు ఎప్పుడూ పోస్టాఫీస్ పథకాలే బెస్ట్ ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతం 2026 ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ స్కీమ్స్ ద్వారా పాత పన్ను విధానంలో సెక్షన్ 80సి కింద ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. మరి ప్రస్తుతం జనాలను బాగా ఆకట్టుకుంటున్న ప్రధాన పోస్టాఫీస్ పథకాల వివరాలను ఇప్పుడు చూద్దాం.
సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్
వయసు పైబడిన వారికి, రిటైర్ అయిన వారికి ఇది ఒక అద్భుతమైన పథకం. 60 ఏళ్లు పైబడిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ప్రస్తుతం ఈ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా వార్షిక ప్రాతిపదికన 8.20 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది ఒకేసారి పెట్టుబడి పెట్టే పథకం. కనీసం రూ. 1000 తో ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది. ఇందులో బ్యూటీ ఏంటంటే.. ఒక్కసారి పెట్టుబడి పెడితే, ప్రతి మూడు నెలలకు ఒకసారి మీకు వడ్డీ రూపంలో ఆదాయం అందుతుంది. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీ అసలు పెట్టుబడి మొత్తం మీకు సురక్షితంగా తిరిగి వస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన
మీ ఇంట్లో చిన్న ఆడపిల్ల ఉంటే, ఆమె భవిష్యత్తు, పెళ్లి లేదా చదువుల కోసం ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ లో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్. ఇందులో కూడా వడ్డీ రేటు అత్యధికంగా వార్షికంగా 8.20 శాతంగా ఉంది. పదేళ్లలోపు వయసు ఉన్న ఆడపిల్లల పేరు మీద మాత్రమే ఈ అకౌంట్ తెరవాలి. ఇందులో చేరిన వారు వరుసగా 15 సంవత్సరాల పాటు డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక ఏడాదికి రూ. 250 నుండి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. అకౌంట్ తెరిచిన నాటి నుండి 21 సంవత్సరాలకు ఈ పథకం మెచ్యూరిటీకి వస్తుంది. ఈ స్కీమ్ లో పెట్టే పెట్టుబడి, వచ్చే వడ్డీ, చివర్లో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్.. ఇలా మూడింటిపైనా ఎలాంటి పన్ను ఉండదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్
స్థిరమైన లాభాలతో పాటు పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. ప్రస్తుతం ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో వార్షిక వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంది. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ఇందులో కూడా మీరు ఒకేసారి డబ్బులు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత వడ్డీతో కలిపి మొత్తం డబ్బు ఒకేసారి మీ చేతికి వస్తుంది. కనీసం రూ. 1000 పెట్టుబడితో ఈ స్కీమ్ లో చేరవచ్చు, గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. మీ స్తోమతను బట్టి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు.
మంత్లీ ఇన్‌కం స్కీమ్
ప్రతినెలా స్థిరమైన ఆదాయం కావాలనుకునే మధ్యతరగతి వారికి ఈ నెలవారీ ఆదాయ పథకం చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై వార్షికంగా 7.40 శాతం వడ్డీ లభిస్తోంది. దీని కాలపరిమితి ఐదేళ్లు. ఇందులో ఒక్కసారి పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేస్తే, ఐదేళ్ల పాటు ప్రతి నెలా మీకు వడ్డీ రూపంలో ఒక నిర్దిష్టమైన అమౌంట్ అకౌంట్ లో పడుతుంది. ఇందులో కనీసం రూ. 1000 పెట్టుబడితో చేరవచ్చు. గరిష్ఠ పెట్టుబడి విషయానికి వస్తే.. సింగిల్ అకౌంట్ తీసుకుంటే రూ. 9 లక్షల వరకు, అదే ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ తీసుకుంటే రూ. 15 లక్షల వరకు గరిష్ఠంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో ఫండ్ సమకూర్చుకోవడానికి పీపీఎఫ్ ను మించిన ఆప్షన్ లేదు. ప్రస్తుతం ఇందులో వడ్డీ రేటు వార్షికంగా 7.10 శాతంగా ఉంది. వడ్డీ రేటు మిగతా వాటికంటే కాస్త తక్కువగా అనిపించినా, దీర్ఘకాలిక ప్రయోజనాల వల్ల కోట్లాది మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ పథకంలో ఏడాదికి కనీసం రూ. 500 నుండి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ అకౌంట్ లో వరుసగా 15 ఏళ్ల పాటు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మీరు పెట్టే పెట్టుబడికి, వచ్చే వడ్డీకి, చివర్లో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కి.. దేనికీ ఒక్క రూపాయి కూడా టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 15 ఏళ్ల తర్వాత కావాలనుకుంటే ఐదేళ్ల చొప్పున ఈ అకౌంట్ ను ఎంతకాలమైనా పొడిగించుకుంటూ వెళ్ళవచ్చు.




