పిల్లల చదువు నాటికి రూ. 16 లక్షల ఫండ్ కావాలా.? ఈ స్కీమ్‌లో నెలకు రూ. 5 వేలు పొదుపు చేస్తే చాలు
PPF: పిల్లల ఉన్నత చదువులు, భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు.
పిల్లల చదువు నాటికి రూ. 16 లక్షల ఫండ్ కావాలా.? ఈ స్కీమ్‌లో నెలకు రూ. 5 వేలు పొదుపు చేస్తే చాలు
PPF: పిల్లల ఉన్నత చదువులు, భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఇలాంటి వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. పిల్లల పేరుతో నెలకు కేవలం రూ.5,000 చొప్పున పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో ఫండ్ తయారవుతుంది.
నెలకు రూ.5,000 పెడితే ఎంత మొత్తం వస్తుంది?
మీరు ప్రతి నెలా రూ.5,000 చొప్పున PPF ఖాతాలో జమ చేస్తే, ఏడాదికి మొత్తం రూ.60,000 అవుతుంది. ఇలా 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా డబ్బు జమ చేస్తే, మీ మొత్తం పెట్టుబడి రూ.9 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం PPFపై 7.1 శాతం వార్షిక వడ్డీ అందిస్తోంది. ఇదే వడ్డీ రేటు కొనసాగితే.. మొత్తం పెట్టుబడి రూ.9,00,000 అయితే వడ్డీ ద్వారా వచ్చే మొత్తం సుమారు రూ.7,27,284 అవుతుంది.
మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ. 16,27,284 అవుతుంది. అయితే ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి PPF వడ్డీ రేటును సమీక్షిస్తుంది. అందువల్ల చివరికి వచ్చే మొత్తంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
పిల్లల పేరుతో PPF ఖాతా ఎలా తెరవాలి?
తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల పేరుతో PPF ఖాతాను సులభంగా ప్రారంభించవచ్చు. అయితే ఒక ముఖ్యమైన నిబంధన గుర్తుంచుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రుల PPF ఖాతా, పిల్లల PPF ఖాతా రెండింటిని కలిపి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు మాత్రమే జమ చేయాలి. అంటే మీరు ఇప్పటికే మీ PPF ఖాతాలో ఏడాదికి రూ.1.5 లక్షలు జమ చేస్తుంటే, అదే సంవత్సరంలో పిల్లల ఖాతాలో అదనంగా డబ్బు జమ చేసే అవకాశం ఉండదు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఈ పరిమితిని గుర్తుంచుకోవాలి.
PPFలో ట్యాక్స్ ప్రయోజనాలు ఏంటి?
PPFలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను పరంగా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రతి ఏడాది వచ్చే వడ్డీపై కూడా పన్ను ఉండదు. 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో అందే మొత్తం కూడా పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ.
అంటే పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు లభించడం PPF ప్రత్యేకత.
కాంపౌండింగ్‌తో భారీ ఫండ్.. ఎవరికి సరైన ఎంపిక?
PPFలో కాంపౌండ్ ఇంటరెస్ట్ (చక్రవడ్డీ) ప్రయోజనం ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం వచ్చిన వడ్డీ కూడా అసలు మొత్తంలో కలుస్తుంది. దానిపై కూడా మళ్లీ వడ్డీ వస్తుంది. దీంతో కాలక్రమేణా మీ పెట్టుబడి వేగంగా పెరుగుతుంది. 15 సంవత్సరాల తర్వాత వెంటనే డబ్బు అవసరం లేకపోతే, ఖాతాను మరో 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. దీంతో పిల్లలు కాలేజీ చదువులు ప్రారంభించే సమయానికి మరింత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు.
అయితే తక్కువ కాలానికి, అంటే 2 నుంచి 4 సంవత్సరాల్లో డబ్బు అవసరమయ్యే లక్ష్యం ఉంటే PPF సరైన ఎంపిక కాదు. ఎందుకంటే ఇందులో మధ్యలో డబ్బు ఉపసంహరించుకోవడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ పిల్లల ఉన్నత విద్య, భవిష్యత్ అవసరాల కోసం దీర్ఘకాలికంగా, ఎలాంటి రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునే వారికి PPF అత్యంత నమ్మకమైన ప్రభుత్వ పథకాలలో ఒకటి.




