QR Code: క్యూఆర్ కోడ్‌లో ఈ మూడు బాక్స్‌లే ఎందుకు ఉంటాయో తెలుసా.?

QR Code: డిజిటల్ పేమెంట్స్ పెరిగిన నేప‌థ్యంలో ఎక్క‌డ చూసినా క్యూఆర్ కోడ్‌లు క‌నిపిస్తున్నాయి.

Mokshith
Published on: 11 Aug 2026 12:03 PM IST
QR Code
X

QR Code: క్యూఆర్ కోడ్‌లో ఈ మూడు బాక్స్‌లే ఎందుకు ఉంటాయో తెలుసా.?

QR Code: డిజిటల్ పేమెంట్స్ పెరిగిన నేప‌థ్యంలో ఎక్క‌డ చూసినా క్యూఆర్ కోడ్‌లు క‌నిపిస్తున్నాయి. అయితే, క్యూఆర్ కోడ్‌ను జాగ్రత్తగా గమనిస్తే మూడు మూలల్లో మాత్రమే పెద్ద నల్లని బాక్స్‌లు కనిపిస్తాయి. నాలుగో మూల మాత్రం ఖాళీగా ఉంటుంది. ఇది కేవలం డిజైన్ కాదు.. దీని వెనుక ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది.

మూడు మూలల్లో ఉన్న బాక్స్‌ల పని ఏంటి?

క్యూఆర్ కోడ్‌లో కనిపించే మూడు పెద్ద నల్లని చతురస్రాలను ఫైండర్ ప్యాటర్న్ (Finder Pattern) అని పిలుస్తారు. మీరు ఫోన్ కెమెరా లేదా స్కానర్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు ముందుగా ఈ మూడు బాక్స్‌లనే గుర్తిస్తుంది. వాటి ఆధారంగా ఇది క్యూఆర్ కోడ్ అని నిర్ధారిస్తుంది. అలాగే క్యూఆర్ కోడ్ ఏ దిశలో ఉందో కూడా ఈ మూడు బాక్స్‌లే స్కానర్‌కు తెలియజేస్తాయి. ఫోన్‌ను నిలువుగా, అడ్డంగా లేదా తలకిందులుగా పట్టుకున్నా స్కానర్ వెంటనే కోడ్‌ను గుర్తించి చదవగలుగుతుంది.

నాలుగో మూలలో బాక్స్ ఎందుకు ఉండదు?

టెక్‌ నిపుణుల ప్రకారం, క్యూఆర్ కోడ్ స్థానం, దిశను గుర్తించడానికి మూడు ఫైండర్ ప్యాటర్న్‌లు చాలు. నాలుగో మూలలో కూడా మరో బాక్స్ పెట్టినా అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఆ మూలను ఖాళీగా ఉంచి, అక్కడ క్యూఆర్ కోడ్‌కు సంబంధించిన ఇతర ముఖ్యమైన డేటా, సాంకేతిక సమాచారం నిల్వ చేసేలా రూపొందించారు. దీంతో క్యూఆర్ కోడ్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.

కొంత భాగం దెబ్బతిన్నా క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుంది?

చాలా సందర్భాల్లో క్యూఆర్ కోడ్‌పై గీతలు పడినా, కొంత భాగం చినిగినా లేదా మసకబారినా కూడా అది సులభంగా స్కాన్ అవుతుంది. దీనికి కారణం ఎరర్ కరెక్షన్ (Error Correction) టెక్నాలజీ. ఈ సాంకేతికత వల్ల క్యూఆర్ కోడ్‌లో కొంత సమాచారం దెబ్బతిన్నా, మిగిలిన డేటా ఆధారంగా అవసరమైన సమాచారాన్ని తిరిగి గుర్తించి స్కాన్ పూర్తి చేస్తుంది. అందుకే కొద్దిగా దెబ్బతిన్న క్యూఆర్ కోడ్‌తో కూడా చాలా సందర్భాల్లో UPI చెల్లింపులు, టికెట్ వెరిఫికేషన్ వంటి పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తవుతాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story