Raymond Lifestyle Q1 Results: ఆదాయం పెరిగినా రేమండ్ లైఫ్‌స్టైల్‌కు నష్టాలే.. క్యూ1 ఫలితాలు విడుదల
రేమండ్ లైఫ్‌స్టైల్ తొలి త్రైమాసికంలో రూ.22.59 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే కంపెనీ ఆదాయం 6 శాతం పెరిగి రూ.1,515.51 కోట్లకు చేరింది.
Raymond Lifestyle Q1 Results
Raymond Lifestyle Q1 Results : రేమండ్ గ్రూప్‌కు చెందిన రేమండ్ లైఫ్‌స్టైల్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ నికర నష్టం గత ఏడాదితో పోలిస్తే మరింత పెరిగి రూ.22.59 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.19.82 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
అయితే ఆదాయంలో మాత్రం కంపెనీ వృద్ధిని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 6 శాతం పెరిగి రూ.1,515.51 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఆదాయం రూ.1,430.43 కోట్లుగా నమోదైంది.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశీయ మార్కెట్లో ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణతో పాటు గార్మెంట్స్ విభాగంలో విక్రయాల పరిమాణం గణనీయంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యంగా భారత్-అమెరికా టారిఫ్ సడలింపులు, యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అమలుతో ఎగుమతి ఆర్డర్లు బలపడినట్లు కంపెనీ తెలిపింది.
అయితే బ్రాండెడ్ టెక్స్‌టైల్స్, హై వ్యాల్యూ కాటన్ షర్టింగ్ విభాగాల్లో గత ఏడాదితో పోలిస్తే ఆదాయం తగ్గినట్లు వెల్లడించింది. దీనికి గత ఏడాది నమోదైన అధిక బేస్ ప్రభావమే కారణమని పేర్కొంది.
తొలి త్రైమాసికంలో కంపెనీ మొత్తం వ్యయాలు కూడా 6 శాతం పెరిగి రూ.1,598.60 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం రూ.1,560.27 కోట్లుగా నమోదై, గత ఏడాదితో పోలిస్తే 5.78 శాతం వృద్ధిని నమోదు చేసింది.
కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్, సీఈవో సత్యకి ఘోష్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ డిమాండ్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. గార్మెంట్స్ వ్యాపారం 50 శాతానికి పైగా వృద్ధి సాధించిందని, భారత్-అమెరికా టారిఫ్ సడలింపులు, యూకే, యూరోపియన్ యూనియన్‌తో రానున్న వాణిజ్య ఒప్పందాలు కంపెనీకి మరింత ఊతమివ్వనున్నాయని తెలిపారు.
రేమండ్ లైఫ్‌స్టైల్ పోర్ట్‌ఫోలియోలో పార్క్ అవెన్యూ, కలర్‌ప్లస్, పార్క్స్, రేమండ్ మేడ్ టు మెజర్, రేమండ్ రెడీ టు వేర్, స్లీప్జ్ బై రేమండ్, ఎథ్నిక్స్ బై రేమండ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి.




