Cheque Book Rules: చెక్‌బుక్ రూల్స్ ఛేంజ్.. ఆర్బీఐ కీలక ప్రకటన

జనవరి 1, 2027 నుంచి పాత చెక్‌బుక్స్ పనిచేయవని, కొత్త భద్రతా ఫీచర్లు తప్పనిసరి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆర్‌బీఐ స్పందించింది.

CR Reddy
Published on: 9 Nov 2026 8:37 AM IST
Cheque Book Rules
X

Cheque Book Rules

Cheque Book Rules: బ్యాంకు లావాదేవీల కోసం ఇప్పటికీ చెక్‌బుక్ వాడుతున్నారా? అయితే మీకు ఈ విషయం తెలియాలి. జనవరి 1, 2027 నుంచి దేశంలో చెక్‌బుక్ నిబంధనలు మారిపోతాయని, పాత చెక్‌బుక్స్ పనిచేయవని సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. కొత్త భద్రతా ఫీచర్లు ఉన్న చెక్‌బుక్ తప్పనిసరిగా తీసుకోవాలని, రూ.50 వేల కంటే ఎక్కువ విలువ ఉన్న పాత చెక్కులను బ్యాంకులు అంగీకరించవని అందులో పేర్కొంటున్నారు. ఈ ప్రచారంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) స్పందించింది. అసలు నిజం ఏంటి? ఖాతాదారులు కొత్త చెక్‌బుక్ తీసుకోవాలా? తెలుసుకుందాం.

జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ తప్పనిసరా?

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2027 జనవరి 1 నుంచి ప్రస్తుతం వాడుతున్న చెక్‌బుక్స్‌ను నిలిపివేసి, కొత్త భద్రతా ప్రమాణాలతో కూడిన చెక్‌బుక్స్ అమల్లోకి తీసుకురావాలనే నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. నవంబర్ 7, 2026న తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) చెక్‌బుక్స్‌లో ఎలాంటి మార్పులు ప్రకటించలేదని పేర్కొంది. కాబట్టి డిసెంబర్ 31 తర్వాత మీ పాత చెక్‌బుక్ పనిచేయదనే భయంతో హడావుడిగా కొత్త చెక్‌బుక్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

వైరల్ సందేశంలో ఏమని చెబుతున్నారు?

వాట్సాప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశంలో పలు వాదనలు చేస్తున్నారు. డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్‌బుక్స్ చెల్లవని, జనవరి 1 నుంచి కొత్త చెక్‌బుక్ తప్పనిసరి అని ప్రచారం చేస్తున్నారు. కొత్త చెక్‌బుక్స్‌లో ప్రత్యేక ఆల్ఫా న్యూమరిక్ కోడ్, కొత్త MICR నంబర్, UV భద్రతా గుర్తులు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు.. రూ.50 వేల కంటే ఎక్కువ విలువ ఉన్న పాత చెక్కులను బ్యాంకులు అంగీకరించవని కూడా పేర్కొంటున్నారు. అయితే ఈ మార్పులేవీ అమల్లోకి వస్తున్నట్లు ఆర్‌బీఐ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయలేదు. ఈ ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.

CTS అంటే ఏమిటి? చెక్ క్లియరింగ్ ఎలా జరుగుతుంది?

చెక్ ట్రంకేషన్ సిస్టమ్‌నే సంక్షిప్తంగా CTS అంటారు. గతంలో ఒక బ్యాంకులో జమ చేసిన చెక్కును మరో బ్యాంకుకు భౌతికంగా పంపించేవారు. దీనివల్ల చెక్ క్లియరింగ్‌కు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుతం CTS విధానంలో చెక్కును ఒకచోటు నుంచి మరోచోటుకు పంపాల్సిన అవసరం లేదు. దాని బదులు చెక్కు చిత్రం, అందులోని అవసరమైన వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో సంబంధిత బ్యాంకుకు పంపిస్తారు. దీంతో క్లియరింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు ఈ విధానంలోనే చెక్కుల చెల్లింపులను నిర్వహిస్తున్నాయి. ఈ వ్యవస్థలో మార్పులు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ఇప్పటివరకు ప్రకటించలేదు.

భవిష్యత్తులో చెక్‌బుక్ భద్రతా ఫీచర్లు మారతాయా?

చెక్కుల భద్రతను మరింత మెరుగుపరిచే అంశాలపై భవిష్యత్తులో ఆర్‌బీఐ సమీక్ష చేసే అవకాశం ఉంది. ఆర్‌బీఐ పేమెంట్స్ విజన్ 2028లో చెక్కుల రూపకల్పన, భద్రతా ప్రమాణాలను పరిశీలించే అంశం ఉంది. చెక్కుల విషయంలో ఒకే రకమైన భద్రతా ప్రమాణాలు ఉండేలా చూడటం, మోసాల అవకాశాలను తగ్గించడం దీని లక్ష్యం. అయితే ఈ ప్రణాళిక ఆధారంగా కొత్త చెక్‌బుక్స్‌ను ఎప్పటి నుంచి తప్పనిసరి చేస్తారనే తేదీని ప్రకటించలేదు. కొత్త ఆల్ఫా న్యూమరిక్ కోడ్, MICR నంబర్, UV ఫీచర్లు తప్పనిసరి అని కూడా ఎలాంటి ఆదేశాలు లేవు. భవిష్యత్తులో మార్పులు రావొచ్చన్న విషయం వేరు.. అవి జనవరి 1, 2027 నుంచే అమల్లోకి వస్తాయనడం వేరు.

రూ.50 వేల కంటే ఎక్కువ పాత చెక్కులు చెల్లవా?

వైరల్ సందేశంలో మరో ముఖ్యమైన ప్రచారం ఏంటంటే.. రూ.50 వేల కంటే ఎక్కువ విలువ ఉన్న పాత చెక్కులను జనవరి 1 నుంచి బ్యాంకులు అంగీకరించవనేది. ఈ విషయంలోనూ కొత్తగా ఎలాంటి నిబంధన ప్రకటించలేదు. కేవలం చెక్కుపై ఉన్న మొత్తం రూ.50 వేలు దాటిందనే కారణంతో దాన్ని తిరస్కరించే కొత్త ఆర్‌బీఐ నిబంధన లేదు. అయితే చెక్కు చెల్లింపునకు ఖాతాలో తగినంత నగదు ఉండాలి. చెక్కుపై సంతకం బ్యాంకు రికార్డులతో సరిపోవాలి. చెక్కు గడువు, ఇతర సాధారణ బ్యాంకింగ్ నిబంధనలు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఈ వైరల్ సందేశాన్ని చూసి మీ పాత చెక్కులు పనికిరావని భావించకండి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.