Paytm: పేటీఎంకు ఆర్బీఐ షాక్.. లైసెన్స్ రద్దు..మరి మీ డబ్బు సంగతేంటి?
Paytm: ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కఠిన ఆంక్షలు విధించింది.
Paytm: పేటీఎంకు ఆర్బీఐ షాక్.. లైసెన్స్ రద్దు..మరి మీ డబ్బు సంగతేంటి?
RBI: డిజిటల్ చెల్లింపుల రంగంలో సంచలనం సృష్టించిన పేటీఎం ఇప్పుడు ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. ఈ వార్త బయటకు రాగానే లక్షలాది మంది వినియోగదారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.
ఆర్బీఐ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది?
బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యంత కీలకమైన పారదర్శకత, నిబంధనల నిర్వహణలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ స్పష్టం చేసింది. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దకపోవడంతో సెంట్రల్ బ్యాంక్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలోనే అమల్లో ఉన్న ఈ నిషేధాన్ని మరింత కఠినతరం చేశారు. నిర్దేశిత గడువు తర్వాత కొత్తగా డిపాజిట్లు స్వీకరించడం లేదా వాలెట్ టాప్-అప్లు చేయడంపై ఆంక్షలు విధించారు. పేమెంట్స్ బ్యాంక్ నిర్వహణకు ఉండాల్సిన కనీస నిబంధనలను పాటించకపోవడం సంస్థకు పెద్ద మైనస్‌గా మారింది.
కంపెనీ ఏం చెప్తోందంటే..?
ఈ పరిణామాల నేపథ్యంలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ , సంస్థ అధికారికంగా స్పందిస్తూ వినియోగదారులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. పేటీఎం యాప్ ఎప్పటిలాగే పనిచేస్తుంది. కేవలం బ్యాంక్ సేవలకు సంబంధించి మాత్రమే ఆర్బీఐ ఆంక్షలు ఉన్నాయి. మిగిలిన డిజిటల్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు అని సంస్థ స్పష్టం చేసింది.
వినియోగదారులకు కీలక సమాచారం
మీరు పేటీఎం యాప్‌ను ఇతర బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసి వాడుతుంటే, మీ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.మీ వాలెట్లో ఇప్పటికే ఉన్న డబ్బు సురక్షితంగా ఉంటుంది. దానిని మీరు ఖర్చు చేసుకోవచ్చు లేదా ఇతర ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్లులు, గ్యాస్ బుకింగ్ వంటి సేవలు యథావిధిగా కొనసాగుతాయి. సినిమా, బస్సు, ఫ్లైట్ టికెట్ల బుకింగ్‌లో ఎలాంటి మార్పు ఉండదు.
ప్రస్తుతానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తు అనిశ్చితిలో ఉన్నప్పటికీ, సామాన్య వినియోగదారుల నిధుల భద్రత విషయంలో ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తోంది. పేటీఎం ఒక థర్డ్ పార్టీ యాప్‌గా ఇతర బ్యాంకులతో కలిసి తన సేవలను కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. కాబట్టి, యాప్ వాడుతున్న వారు కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.




