RBI Guidelines: పాత అకౌంట్లలో డబ్బు మర్చిపోయారా? ఇలా చేయండి!
RBI Guidelines: మీ పాత బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడో డబ్బులు వేసి మర్చిపోయారా? అయితే మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్త చెప్పింది.
RBI Guidelines: పాత అకౌంట్లలో డబ్బు మర్చిపోయారా? ఇలా చేయండి!
RBI Guidelines: సాధారణంగా దైనందిన జీవితంలో చాలామంది ఉద్యోగాలు మారినప్పుడో లేదా వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడో కొత్త బ్యాంకు ఖాతాలు తెరుస్తుంటారు. ఈ క్రమంలో పాత ఖాతాలను వాడటం మానేసి, అందులో ఉన్న కొద్దిపాటి డబ్బును పూర్తిగా మర్చిపోతుంటారు.
ఇలా గతంలో ఎప్పుడో ఏదైనా బ్యాంకులో ఖాతా తెరిచి, అందులో కొంత డబ్బు వేసి ఏళ్ల తరబడి వాడకుండా మర్చిపోయిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించింది. అలా పాత బ్యాంకు ఖాతాలలో మీరు ఏళ్ల క్రితం మరిచిపోయిన డబ్బును ఇప్పుడు కూడా చాలా సులభంగా తిరిగి పొందొచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.
పూర్తి వివరాల ప్రకారం, ఏదైనా ఒక బ్యాంకు అకౌంట్ వరుసగా 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, అందులోని డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్' ఫండ్‌లోకి బదిలీ చేస్తారు. అయితే, ఆ డబ్బును ఖాతాదారులు ఎప్పుడైనా తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ కల్పిస్తోంది.
ఆ డబ్బు తిరిగి పొందడం కోసం మీరు చేయాల్సిందల్లా మీ పాత బ్యాంకుకు చెందిన ఏదైనా సమీప శాఖను స్వయంగా సందర్శించడమే. అక్కడికి వెళ్లి మీ అకౌంట్ వివరాలతో పాటుగా, అప్‌డేటెడ్ కేవైసీ డాక్యుమెంట్లను అనగా మీ ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి అధికారిక గుర్తింపు కార్డులను అధికారులకు సమర్పించి తగిన క్లెయిమ్ ఫారమ్ నింపాలి.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆ అకౌంట్‌కు వర్తిస్తే గనుక, అసలు డబ్బుతో పాటుగా ఇన్నేళ్ల వడ్డీని కూడా కలిపి మీరు సురక్షితంగా తిరిగి పొందొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తమ మార్గదర్శకాల్లో వివరించారు.




