New Cheque Book Rules 2027: జనవరి 2027 నుంచి కొత్త చెక్‌బుక్ నిబంధనలా? ఆర్బీఐ క్లారిటీ ఇదే!
New Cheque Book Rules 2027: జనవరి 2027 నుంచి కొత్త చెక్‌బుక్ నిబంధనలు వస్తాయన్న ప్రచారాన్ని ఆర్బీఐ ఖండించింది. వైరల్ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.
New Cheque Book Rules 2027: జనవరి 2027 నుంచి కొత్త చెక్‌బుక్ నిబంధనలా? ఆర్బీఐ క్లారిటీ ఇదే!
New Cheque Book Rules 2027: బ్యాంకు ఖాతాదారులకు జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టత ఇచ్చింది. కొత్త భద్రతా ప్రమాణాలతో కూడిన చెక్‌బుక్‌లను ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించింది. ఈ ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలోని బ్యాంకుల్లో చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) కింద ప్రామాణిక చెక్‌బుక్‌లు వినియోగంలో ఉన్నాయి. అయితే, డిసెంబర్ 31, 2026 తర్వాత ప్రస్తుత చెక్‌బుక్‌లు మారిపోతాయని, 2027 జనవరి 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలతో కూడిన చెక్‌బుక్‌లు అందుబాటులోకి వస్తాయని సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రచారంపై స్పందించిన ఆర్బీఐ.. CTS చెక్‌బుక్‌లకు సంబంధించి అలాంటి కొత్త నిబంధనలేవీ తీసుకురావడం లేదని స్పష్టం చేసింది. జనవరి 2027 నుంచి కొత్త చెక్‌బుక్‌లు తప్పనిసరి అవుతాయన్న వార్తలు అవాస్తవమని పేర్కొంది.
బ్యాంకు ఖాతాదారులు ఇలాంటి వైరల్ సందేశాలను నమ్మవద్దని, ఆర్బీఐ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది.
వ్యవసాయ రుణాలపై ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు
మరోవైపు వ్యవసాయ రుణాల మంజూరు, పర్యవేక్షణలో పారదర్శకత పెంచేందుకు ఆర్బీఐ కీలక మార్పులను ప్రతిపాదించింది. ప్రాధాన్యతా రంగ రుణాల (PSL) లక్ష్యాలు, వర్గీకరణకు సంబంధించి 2026 ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై నవంబర్ 26 వరకు సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించింది.
ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం బంగారం తాకట్టుపై వ్యవసాయ రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకులు మరిన్ని వివరాలను తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన సాగు భూమి వివరాలు, భూమి ఉన్న ప్రాంతం, పండిస్తున్న పంటలు, వర్తించే సందర్భాల్లో పంటలపై హైపోథెకేషన్ వివరాలను నమోదు చేయాలి.
వ్యవసాయ రుణాల మంజూరులో కీలక మార్పులు
వ్యవసాయ రుణాల మొత్తాన్ని కేవలం తాకట్టు పెట్టిన బంగారం విలువ లేదా ఇతర హామీల ఆధారంగా నిర్ణయించకూడదని ఆర్బీఐ ప్రతిపాదించింది. సంబంధిత వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన రుణ మొత్తం, వర్తించే ఫైనాన్స్ స్కేల్ ఆధారంగా రుణ పరిమితిని నిర్ణయించాలని సూచించింది.
అలాగే మంజూరు చేసిన రుణాలను రైతులు ఏ అవసరాల కోసం వినియోగిస్తున్నారో పర్యవేక్షించేందుకు బ్యాంకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలి. ఈ పర్యటనలకు సంబంధించిన రికార్డులను కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.
భూమిలేని రైతులు, కౌలుదారులకు ప్రయోజనం
ప్రాధాన్యతా రంగ రుణాల కింద అర్హత కల్పించే విషయంలో భూమిలేని వ్యవసాయ కార్మికులు, కౌలుదారులకు సంబంధించి కూడా ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు చేసింది. భూమి రికార్డులు లేదా కౌలు ఒప్పందాలు అందుబాటులో లేని సందర్భాల్లో వారి వ్యవసాయ కార్యకలాపాలను నిర్ధారించేందుకు ప్రత్యామ్నాయ ధృవీకరించదగిన పత్రాలను బ్యాంకులు పరిశీలించాల్సి ఉంటుంది.
ఈ మార్పుల ద్వారా వ్యవసాయ రుణాల మంజూరులో పారదర్శకత పెంచడంతో పాటు, రుణాల దుర్వినియోగాన్ని అరికట్టడం, అర్హులైన రైతులకు రుణ సదుపాయాలు అందించడం లక్ష్యంగా ఆర్బీఐ ఈ ప్రతిపాదనలు రూపొందించింది.




