RD Vs SIP: నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడితే.. ఎందులో ఎక్కువ లాభం.?

RD Vs SIP: ప్రతి నెల కొంత మొత్తాన్ని సేవ్ చేసి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తుంటారు.

Mokshith
Published on: 7 May 2026 3:06 PM IST
RD Vs SIP
X

RD Vs SIP

RD Vs SIP: ప్రతి నెల కొంత మొత్తాన్ని సేవ్ చేసి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. అలాంటి వారికి RD (రికరింగ్ డిపాజిట్), SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) మంచి ఎంపికలుగా కనిపిస్తాయి. అయితే నెలకు రూ.10 వేల చొప్పున పెట్టుబ‌డి పెట్టే వారికి ఏది బెస్ట్ ఆప్ష‌నో ఇప్పుడు తెలుసుకుందాం.

RD అంటే ఏమిటి? ఎంత రాబడి వస్తుంది?

RD అంటే రికరింగ్ డిపాజిట్. ఇది బ్యాంకులు లేదా పోస్టాఫీస్ అందించే సేవింగ్స్ పథకం. ఇందులో ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని జమ చేస్తూ వెళ్తారు. దీనిపై ముందుగానే నిర్ణయించిన వడ్డీ రేటు లభిస్తుంది. అందువల్ల ఇందులో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెడుతూ సగటున 6.05 శాతం వార్షిక వడ్డీ వస్తుందని అనుకుంటే.. 10 ఏళ్ల తర్వాత సుమారు రూ.16.48 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే 15 ఏళ్లు కొనసాగిస్తే దాదాపు రూ.29.27 లక్షలు, 20 ఏళ్లకు సుమారు రూ.46.54 లక్షల వరకు ఫండ్ తయారవుతుంది. RDలో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. పెట్టుబడిపై ఎంత రాబడి వస్తుందో ముందే అంచనా వేయొచ్చు. మార్కెట్ ప్రభావం ఉండదు. అందుకే సురక్షిత పెట్టుబడిగా చాలామంది దీనిని ఎంచుకుంటారు.

SIPలో పెట్టుబడి పెడితే ఎంత లాభం?

SIP అనేది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే విధానం. ఇందులో ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. అయితే SIPలో వచ్చే రాబడి మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో SIP చేస్తే సుమారు 6 నుంచి 7 శాతం వరకు రాబడి రావచ్చు. ఇది RDతో దాదాపు సమానంగా ఉంటుంది. కానీ హైబ్రిడ్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే లాభాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

హైబ్రిడ్ ఫండ్స్‌లో సగటున 8 నుంచి 10 శాతం వరకు రాబడి రావచ్చు. అలా చూస్తే 20 ఏళ్లలో మీ పెట్టుబడి రూ.57 లక్షల వరకు చేరవచ్చు. ఇక ఈక్విటీ ఫండ్స్‌లో 10 నుంచి 13 శాతం వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో నెలకు రూ.10 వేల SIP చేస్తే రూ.45 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా ఫండ్ కూడా తయారయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

RD, SIP మధ్య ప్రధాన తేడాలు ఏమిటి?

RDలో రాబడి స్థిరంగా ఉంటుంది. పెట్టుబడిపై ఎంత డబ్బు వస్తుందో ముందే తెలుసుకోవచ్చు. అందువల్ల రిస్క్ తీసుకోవాలని ఇష్టపడని వారికి ఇది మంచి ఎంపిక. అయితే లాభాలు పరిమితంగానే ఉంటాయి.

మరోవైపు SIPలో మార్కెట్ ఒడిదుడుకులు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు పెట్టుబడి విలువ తగ్గొచ్చు. కానీ దీర్ఘకాలంలో మార్కెట్ పెరుగుదల వల్ల మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే SIPలో పెట్టుబడి మొత్తాన్ని ఎప్పుడైనా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. RDలో ఈ సౌకర్యం చాలా పరిమితంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఫ్లెక్సీ RDలు అందిస్తున్నా.. SIPలో ఉన్నంత స్వేచ్ఛ మాత్రం ఉండదు.

ఎవరు ఏది ఎంచుకోవాలి?

మీ పెట్టుబడి లక్ష్యం, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా సరైన ఎంపిక చేసుకోవాలి. భద్రత, స్థిరమైన రాబడి కావాలనుకుంటే RD మంచి ఎంపికగా చెప్పొచ్చు. రిస్క్ తీసుకుని ఎక్కువ సంపద సృష్టించాలని అనుకునేవారికి SIP మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

దీర్ఘకాలంలో చూస్తే SIP ద్వారా RD కంటే ఎక్కువ ఫండ్ తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్కెట్ రిస్క్‌ను కూడా గుర్తుంచుకోవాలి. అందుకే పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, రిస్క్ సామర్థ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story