AJIO Beauty: ఆజియో బ్యూటీ లాంచ్.. 1,500కుపైగా బ్రాండ్లతో రిలయన్స్ కొత్త ప్లాట్‌ఫామ్
రిలయన్స్ రీటైల్ 'ఆజియో బ్యూటీ' ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. 1,500కుపైగా బ్రాండ్లు, 19 వేల పిన్‌కోడ్‌లకు డెలివరీ సౌకర్యం.
AJIO Beauty
AJIO Beauty : రిలయన్స్ రీటైల్ బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు 'ఆజియో బ్యూటీ' పేరుతో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ సేవలను ఒకే వేదికపై అందించాలన్న లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆజియో బ్యూటీ ద్వారా స్కిన్‌కేర్, మేకప్, హెయిర్‌కేర్, ఫ్రాగ్రెన్సెస్, బాత్ అండ్ బాడీ, పర్సనల్ కేర్, బ్యూటీ యాక్సెసరీస్ వంటి విభాగాల్లోని ఉత్పత్తులు ఒకే చోట లభించనున్నాయి. దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 1,500కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులు ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటాయని రిలయన్స్ రీటైల్ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 19,000కు పైగా పిన్‌కోడ్‌లకు డెలివరీ సదుపాయం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎంపిక చేసిన నగరాల్లో 'ఆజియో రష్' సేవ ద్వారా బ్యూటీ ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది.
రిలయన్స్ రీటైల్‌కు చెందిన ఓమ్నీచానల్ బ్యూటీ ప్లాట్‌ఫామ్ టైరా నైపుణ్యాన్ని, ఆజియోకు ఉన్న ఫ్యాషన్ ఆధారిత డిజిటల్ కస్టమర్ బేస్‌తో అనుసంధానం చేసి ఈ సేవను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
కేవలం ఉత్పత్తుల కొనుగోలుకే కాకుండా, వినియోగదారులకు తాజా బ్యూటీ ట్రెండ్స్, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన సిఫార్సులు, ఉత్పత్తుల్లో ఉపయోగించే పదార్థాలపై సమాచారం, బ్యూటీ రొటీన్‌లకు సంబంధించిన సూచనలను కూడా ఈ ప్లాట్‌ఫామ్ అందించనుంది.
ఈ సందర్భంగా ఆజియో ప్రతినిధులు మాట్లాడుతూ, వినియోగదారులలో ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులను ఒకే వేదికపై పొందాలనే ఆసక్తి పెరుగుతోందని, ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆజియో బ్యూటీని ప్రారంభించినట్లు తెలిపారు. భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో నాణ్యమైన బ్యూటీ షాపింగ్ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.




