Rice: వ‌ర్షాకాలంలో బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు!

Rice: వర్షాకాలంలో బయట వాతావరణంతో పాటు ఇంట్లోనూ తేమ పెరుగుతుంది.

Mokshith
Updated on: 23 Aug 2026 7:36 PM IST
Rice
X

Rice: వ‌ర్షాకాలంలో బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు!

Rice: వర్షాకాలంలో బయట వాతావరణంతో పాటు ఇంట్లోనూ తేమ పెరుగుతుంది. దీంతో నిల్వ చేసే బియ్యం వంటి ధాన్యాలకు పురుగులు ప‌ట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బియ్యం డబ్బాను తరచూ తెరవడం వల్ల తేమ లోపలికి చేరుతుంది. డబ్బా సరిగ్గా మూసుకోకపోయినా పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ స‌మస్య‌కు ఒక చిన్న ఆకుతో చెక్ పెట్టొచ్చు.

బిర్యానీ ఆకుతో ప‌రిష్కారం

బిర్యానీ ఆకుకు ప్రత్యేకమైన ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసన కొన్ని చిన్న కీటకాలను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అందుకే బియ్యం డబ్బాలో ఎండిన బిర్యానీ ఆకుల‌ను వేయడం ఒక సాధారణ ఇంటి చిట్కాగా ఉపయోగిస్తారు. బియ్యం నిల్వ చేసే డబ్బాలో 4 నుంచి 5 ఎండిన బిర్యానీ ఆకులు వేసి, మూతను గట్టిగా మూసేయండి. కొంతకాలం తర్వాత ఆకుల వాసన తగ్గితే వాటిని కొత్తవాటితో మార్చాలి. అయితే ఇది పురుగులను పూర్తిగా నివారిస్తుందని క‌చ్చితంగా చెప్ప‌లేం. బియ్యాన్ని సరిగ్గా నిల్వ చేయడం కూడా అంతే ముఖ్యం.

బియ్యం డబ్బాను ఎప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచాలి

బియ్యంలో పురుగులు పడకుండా ఉండాలంటే ముందుగా తేమను దూరంగా ఉంచాలి. బియ్యం డబ్బాను తడి ప్రదేశంలో కాకుండా పొడిగా ఉండే చోట పెట్టాలి. డబ్బా పూర్తిగా ఎయిర్ టైట్‌గా ఉండేలా చూసుకోవాలి.

ప్రతిరోజూ బియ్యం తీసుకునేటప్పుడు డబ్బాను ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. అలాగే తడి చేతులతో బియ్యాన్ని తాకకుండా జాగ్రత్తపడాలి. డబ్బాలో తేమ చేరితే బియ్యం పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది.

పాత బియ్యాన్ని కొత్త బియ్యంతో కలపకండి

కొత్తగా బియ్యం తెచ్చినప్పుడు, ఇప్పటికే ఉన్న పాత బియ్యంతో వెంటనే కలపడం మంచిది కాదు. పాత బియ్యంలో పురుగులు లేదా వాటి గుడ్లు ఉంటే అవి కొత్త బియ్యానికి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త బియ్యాన్ని ప్రత్యేకంగా నిల్వ చేయడం మంచిది. పాత బియ్యం డబ్బాను ఖాళీ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టి కొత్త బియ్యం నింపాలి.

వెల్లుల్లి, ఎండు మిరపకాయలతోనూ

బిర్యానీ ఆకులతో పాటు కొన్ని ఇళ్లలో ఎండిన వెల్లుల్లి రెబ్బలు లేదా ఎండు మిరపకాయలను కూడా బియ్యం డబ్బాలో ఉంచొచ్చు. వీటి ఘాటైన వాసన కూడా కొన్ని కీటకాలను దూరంగా ఉంచేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

అయితే బియ్యంలో ఇప్పటికే ఎక్కువగా పురుగులు కనిపిస్తే కేవలం ఈ చిట్కాలపైనే ఆధారపడకండి. బియ్యాన్ని పరిశీలించి, డబ్బాను పూర్తిగా శుభ్రం చేసి, కొత్త బియ్యాన్ని పొడి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయడం మంచిది. ఇలా తేమను నియంత్రించడం, డబ్బాను శుభ్రంగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే బియ్యాన్ని ఎక్కువకాలం సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story