Royal Pop: చేతికి ధరించలేని ఈ వాచ్ ధర అక్షరాల రూ. 40 వేలు.. అంతలా ఏముందనేగా?
Royal Pop: లగ్జరీ వాచ్‌లను ఇష్టపడే వారి కోసం ప్రముఖ వాచ్ తయారీ సంస్థలు స్వాచ్ (Swatch), ఆడెమార్స్ పిగ్వెట్ (Audemars Piguet) కలిసి కొత్త కలెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
Royal Pop: చేతికి ధరించలేని ఈ వాచ్ ధర అక్షరాల రూ. 40 వేలు.. అంతలా ఏముందనేగా?
Royal Pop: లగ్జరీ వాచ్‌లను ఇష్టపడే వారి కోసం ప్రముఖ వాచ్ తయారీ సంస్థలు స్వాచ్ (Swatch), ఆడెమార్స్ పిగ్వెట్ (Audemars Piguet) కలిసి కొత్త కలెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. "రాయల్ పాప్" (Royal Pop) పేరుతో విడుదలైన ఈ ప్రత్యేక పాకెట్ వాచ్‌లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.
రాయల్ పాప్ పాకెట్ వాచ్‌ల విడుదల
స్వాచ్, ఆడెమార్స్ పిగ్వెట్ సంయుక్తంగా రూపొందించిన రాయల్ పాప్ పాకెట్ వాచ్ సిరీస్ 2026 మే 16న విడుదలైంది. ఈ కలెక్షన్‌లో మొత్తం ఎనిమిది రంగురంగుల పాకెట్ వాచ్‌లు ఉన్నాయి. ఒక్కో వాచ్ ధర 400 నుంచి 420 డాలర్ల మధ్య ఉండగా, భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.40 వేల వరకు ఉంటుంది. సాధారణంగా చేతికి ధరించే వాచ్‌లకు భిన్నంగా వీటిని పాతకాలపు పాకెట్ వాచ్‌ల తరహాలో రూపొందించారు. ప్రత్యేక డిజైన్, ఆకర్షణీయమైన రంగులు, పరిమిత ఎడిషన్ విడుదల కారణంగా ఈ వాచ్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది.
విడుదల వెంటనే స్టోర్ల వద్ద భారీ రద్దీ
రాయల్ పాప్ సిరీస్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే అనేక దేశాల్లోని స్వాచ్ స్టోర్ల వద్ద భారీగా జనాలు చేరుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 30కిపైగా స్టోర్లను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఈ వాచ్‌లను కొనుగోలు చేయడానికి ప్రజలు గంటల తరబడి క్యూల్లో నిలబడటం విశేషం.
ముంబై, ఢిల్లీ, దుబాయ్ ఈవెంట్లు రద్దు
అధిక జనసందోహం, భద్రతా సమస్యల కారణంగా ముంబై, ఢిల్లీ, దుబాయ్‌లలో నిర్వహించాల్సిన లాంచ్ ఈవెంట్లను రద్దు చేశారు. మరోవైపు బెంగళూరులోని స్టోర్ల వద్ద కొనుగోలుదారుల భారీ క్యూలు కనిపించాయి.
ఈ కలెక్షన్‌పై ఇంత ఆసక్తి రావడానికి మరో కారణం కూడా ఉంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రతిష్ఠాత్మక గడియార బ్రాండ్లలో ఆడెమార్స్ పిగ్వెట్ ఒకటి. సాధారణంగా ఆ సంస్థ గడియారాల ధరలు 20 వేల డాలర్లకు పైగానే ప్రారంభమవుతాయి. అలాంటి బ్రాండ్ స్వాచ్‌తో కలిసి తక్కువ ధరలో ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకురావడం వాచ్ ప్రేమికులను ఆకట్టుకుంది.
యువతలో పెరిగిన క్రేజ్.. రీసేల్ మార్కెట్లో భారీ డిమాండ్
రాయల్ పాప్ విడుదల సమయంలో స్టోర్ల వద్ద ఎక్కువగా Gen Z యువత కనిపించడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ వాచ్‌ల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాషన్, కలెక్టిబుల్ వస్తువులపై ఆసక్తి ఉన్న యువత ఈ ప్రత్యేక ఎడిషన్‌ను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొన్ని రీసేల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వాచ్‌లను అసలు ధర కంటే చాలా ఎక్కువకు విక్రయించే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సమాచారం. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటంతో భవిష్యత్తులో వీటి విలువ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




