SBI Data Leak: ఎస్‌బీఐపై సైబర్ దాడి.. డార్క్‌వెబ్‌లో కస్టమర్ల లోన్ డేటా, పర్సనల్ వివరాలు లీక్!
SBI Data Leak: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సైబర్ దాడి జరిగింది. 3,897 మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలు, లోన్ రికార్డులు డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైనట్లు ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
SBI Data Leak: ఎస్‌బీఐపై సైబర్ దాడి.. డార్క్‌వెబ్‌లో కస్టమర్ల లోన్ డేటా, పర్సనల్ వివరాలు లీక్!
SBI Data Leak: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ దాడికి గురైంది. కస్టమర్లకు సంబంధించిన సుమారు 3,897 వ్యక్తిగత రికార్డులు డార్క్‌వెబ్‌లో దర్శనమిచ్చినట్లు బ్యాంకు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది.
లీక్ అయిన వివరాలు ఇవే:
బ్యాంక్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ మరియు CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) ఇచ్చిన ముందస్తు హెచ్చరికలతో ఈ ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. లీక్ అయిన సమాచారంలో:
కస్టమర్ల పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు.
ఈమెయిల్ ఐడీలు, నివాస చిరునామాలు, జెండర్.
బ్రాంచ్ ఐడీ, సీఐఎఫ్ (CIF) ఐడెంటిఫయర్లు, రుణ దరఖాస్తులు (Loan Records) మరియు దానికి సంబంధించిన పత్రాలు ఉన్నట్లు ఎస్‌బీఐ ప్రాథమిక విచారణలో గుర్తించింది.
దాడి వెనుక 'సిరియసిమ్':
సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సైట్ 'సైబర్‌పల్స్' తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సైబర్ దాడి వెనుక 'సిరియసిమ్' (Siriusim) అనే హ్యాకర్ల ముఠా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న మొదటిసారి వెలుగుచూసిన ఈ లీక్‌లో దాదాపు 3,75,000 CSV లైన్లు, 2,722 PDF పత్రాలు, లోన్ అప్లికేషన్లు మరియు అకౌంట్ ఓపెనింగ్ డాక్యుమెంట్లు ఉన్నట్లు హెచ్చరించింది.
బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి ప్రభావం లేదు:
సంఘటన బయటపడిన వెంటనే తమ సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్‌ను రంగంలోకి దించామని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. సీఈఆర్‌టీ-ఇన్ (CERT-In) ఆమోదిత స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీతో విచారణ జరిపిస్తున్నట్లు తెలిపింది. ఈ డేటా లీక్ వల్ల బ్యాంక్ యొక్క ప్రధాన బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా సాధారణ సేవలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
కస్టమర్లు పాటించాల్సిన జాగ్రత్తలు:
లీక్ అయిన డేటాను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఐడెంటిటీ థెఫ్ట్, ఫేక్ లోన్ ఆఫర్లు, లేదా ఫిషింగ్ కాల్స్ చేసే ప్రమాదం ఉందని సైబర్ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ (OTP), పిన్ (PIN), పాస్‌వర్డ్ లేదా సీవీవీ (CVV) వివరాలను ఎవరికీ షేర్ చేయకూడదు.
రుణాలు, కేవైసీ (KYC) లేదా అకౌంట్ బ్లాక్ అయినట్లు వచ్చే సందేహాస్పద లింకులను క్లిక్ చేయకూడదు.
ఏదైనా అనుమానాస్పద కాల్స్ వస్తే నేరుగా ఎస్‌బీఐ అధికారిక బ్రాంచ్ లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి.




