గ్రీన్ ఎనర్జీ దిశగా ఎస్‌సీసీఎల్ మరో అడుగు.. ఏపీఎచ్‌ఎంఈఎల్‌లో సోలార్ ప్లాంట్ ప్రారంభం
విజయవాడలోని ఏపీఎచ్‌ఎంఈఎల్‌లో ఎస్‌సీసీఎల్ 300 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించింది. గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
Solar Power Plant
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి బుధవారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీఎచ్‌ఎంఈఎల్)లో ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఏపీఎచ్‌ఎంఈఎల్ ఎస్‌సీసీఎల్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.
సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్లాంట్‌లో నిర్మించిన కొత్త సీసీ, ఆర్‌సీసీ అంతర్గత రహదారులను కూడా ఆయన ప్రారంభించారు. ఈ మౌలిక సదుపాయాలు సంస్థ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో ఎస్‌సీసీఎల్ తన అనుబంధ సంస్థ ఏపీఎచ్‌ఎంఈఎల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు విభిన్న రంగాల్లో విస్తరించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు.
ఉద్యోగులను అభినందించిన ఆయన, ఏపీఎచ్‌ఎంఈఎల్ తన 50 ఏళ్ల చరిత్రలోనే అత్యధికంగా రూ.63.13 కోట్ల టర్నోవర్, రూ.23.33 కోట్ల నికర లాభం నమోదు చేసి చారిత్రక విజయాన్ని సాధించిందని చెప్పారు. ఈ విజయానికి కృషి చేసిన ఉద్యోగులు, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.




