Adani Group: సెబీతో అదానీ గ్రూప్ వివాదంక్లోజ్.. రూ. 1.51 కోట్లతో సెటిల్‌మెంట్!
Adani Group: సెబీతో నెలకొన్న పాత వివాదాలను అదానీ గ్రూప్ కంపెనీలు రూ. 1.51 కోట్ల సెటిల్‌మెంట్ ఫీజుతో పరిష్కరించుకున్నాయి.
Adani Group: సెబీతో అదానీ గ్రూప్ వివాదంక్లోజ్.. రూ. 1.51 కోట్లతో సెటిల్‌మెంట్!
SEBI: దేశీయ కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన అదానీ గ్రూప్‌నకు సంబంధించిన పాత వివాదాలకు ఎట్టకేలకు తెరపడింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో నెలకొన్న వివాదాలను అదానీ గ్రూప్ కంపెనీలు విజయవంతంగా పరిష్కరించుకున్నాయి. గతంలో లావాదేవీల వెల్లడిలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలకు సంబంధించి సెబీ ఇచ్చిన నోటీసుల వ్యవహారానికి.. తాజాగా చెల్లించిన సెటిల్‌మెంట్ ఫీజుతో పరిసమాప్తి పడింది.
ఒకే గ్రూప్‌నకు చెందిన వేర్వేరు కంపెనీలు తమలో తాము జరిపే ఆర్థిక లావాదేవీల వివరాలను పెట్టుబడిదారులకు నిబంధనల ప్రకారం స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొన్ని లావాదేవీల సమాచారాన్ని సరైన రీతిలో వెల్లడించలేదని, అలాగే ఆడిట్ నివేదికలపై సంతకాలు చేసిన చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థల అనుమతుల్లో కొన్ని లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ సెబీ గతంలో అదానీ గ్రూప్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.
ఈ పాత కేసుల విచారణను పూర్తిగా ముగించుకునేందుకు సెబీ నిబంధనల ప్రకారం అదానీ గ్రూప్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా మొత్తం రూ. 1.51 కోట్ల రూపాయలను సెటిల్‌మెంట్ ఫీజుగా చెల్లించి వివాదానికి ముగింపు పలికాయి.
కంపెనీల వారీగా చెల్లించిన మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: రూ. 76.05 లక్షలు
అదానీ గ్రీన్ ఎనర్జీ: రూ. 45.50 లక్షలు
మిగిలిన మూడు కంపెనీలు : ఒక్కో సంస్థ సుమారు రూ. 10 లక్షల చొప్పున చెల్లించాయి. ఈ సెటిల్‌మెంట్ నిధులను అధికారికంగా జమ చేయడంతో అదానీ గ్రూప్ కంపెనీలపై కొనసాగుతున్న విచారణ ప్రక్రియను పూర్తిగా ముగిస్తున్నట్లు సెబీ అధికారికంగా ప్రకటించింది.
గతంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణల విషయంలోనూ సెబీ ఇప్పటికే అదానీ గ్రూప్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సెటిల్‌మెంట్ ఫీజు చెల్లింపుతో అదానీ కంపెనీలపై ఉన్న అన్ని పాత వివాదాలు, విచారణలు పూర్తిగా తొలగిపోయినట్లయింది. దీంతో ఇన్వెస్టర్లలో నమ్మకం మరింత బలపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.




