Secunderabad-Kazipet Rail Project: సికింద్రాబాద్-కాజీపేట రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
సికింద్రాబాద్-కాజీపేట రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.10,021 కోట్లతో పనులు చేపట్టనుంది.
Secunderabad-Kazipet Rail Project
తెలంగాణకు కీలకమైన సికింద్రాబాద్ (ఘట్కేసర్)-కాజీపేట రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో దేశవ్యాప్తంగా ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ఐదు ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.10,021 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాల పరిధిలో ఈ పనులు చేపట్టనున్నారు. వీటి ద్వారా భారత రైల్వే నెట్‌వర్క్‌కు సుమారు 540 కిలోమీటర్ల మేర అదనపు రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్నాయి.
సికింద్రాబాద్-కాజీపేటకు 110 కిలోమీటర్లు
ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో సికింద్రాబాద్ (ఘట్కేసర్)-కాజీపేట 110 కిలోమీటర్ల మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు ఒకటి. ఈ మార్గంలో లైన్ సామర్థ్యం పెరగడంతో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. రైళ్ల రద్దీ తగ్గడంతో ప్రయాణ సమయం, నిర్వహణ సామర్థ్యం, సేవల విశ్వసనీయత మెరుగుపడే అవకాశం ఉంది.
మిగిలిన నాలుగు ప్రాజెక్టుల్లో అరక్కోణం-రేణిగుంట మధ్య 77 కిలోమీటర్ల మేర 3వ, 4వ లైన్లు, వైట్‌ఫీల్డ్-బంగారుపేట మధ్య 47 కిలోమీటర్ల మేర 3వ, 4వ లైన్లు ఉన్నాయి. అలాగే హోసూరు-ఓమలూరు మధ్య 147 కిలోమీటర్ల డబ్లింగ్, సేలం-కరూర్-దిండిగల్ మధ్య 159 కిలోమీటర్ల డబ్లింగ్ పనులకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
52 లక్షల మందికి ప్రయోజనం
ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులతో సుమారు 2,121 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. దాదాపు 52 లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం కలగనుంది.
ఈ ప్రాజెక్టులను PM-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టనున్నారు. రవాణా మార్గాల మధ్య సమన్వయం, మల్టీమోడల్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడంపై ప్రాజెక్టుల్లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
పర్యాటక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ
రైల్వే లైన్ సామర్థ్యం పెరగడంతో తిరుపతి, తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, యాదాద్రి ఆలయం, భువనగిరి కోట, కోడైకెనాల్, హొగెనక్కల్ జలపాతాలు, మేట్టూరు డ్యామ్, సత్యమంగళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తదితర ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
సరకు రవాణాకు భారీ ఊతం
బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల రవాణాకు ఈ మార్గాలు ఎంతో ముఖ్యమైనవి. లైన్ సామర్థ్యం పెంపుతో అదనంగా 47 మిలియన్ టన్నుల సరకు రవాణా (MTPA) పెరిగే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.
2029-30 నాటికి పూర్తి
రైల్వే మల్టీట్రాకింగ్ పనులతో రద్దీ తగ్గడంతో పాటు రైళ్ల నిర్వహణ సామర్థ్యం, సేవల విశ్వసనీయత పెరగనుంది. ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రైల్వే రవాణా పర్యావరణహితమైన, ఇంధన సామర్థ్యం కలిగిన రవాణా విధానం కావడంతో ఈ ప్రాజెక్టులు దేశ లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంలోనూ సహాయపడనున్నాయి. అలాగే సుమారు 8 కోట్ల లీటర్ల చమురు దిగుమతులను తగ్గించడంతో పాటు 42 కోట్ల కిలోల CO₂ ఉద్గారాలను తగ్గించవచ్చని కేంద్రం పేర్కొంది.




