వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఇచ్చే FD.. ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ లభిస్తుందంటే.?

FD: రిటైర్మెంట్ తర్వాత చేతిలో ఉన్న పొదుపును సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు మంచి ఆదాయం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Mokshith
Published on: 4 Sept 2026 5:33 PM IST
FD
X

వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఇచ్చే FD.. ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ లభిస్తుందంటే.?

FD: రిటైర్మెంట్ తర్వాత చేతిలో ఉన్న పొదుపును సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు మంచి ఆదాయం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలాంటి వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఒక మంచి ఆప్ష‌న్‌. మ‌రి ఎఫ్డీల విష‌యంలో బ్యాంకుల వడ్డీ రేట్లు, కాలపరిమితి, ఇతర నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ..

సాధారణంగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తాయి. ఈ అదనపు వడ్డీ 25 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు ఉండొచ్చు. బేసిస్ పాయింట్ అంటే వడ్డీ రేటులో చిన్న మార్పును సూచిస్తుంది. ఉదాహరణకు 100 బేసిస్ పాయింట్లు అంటే 1 శాతం. అదే 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం, 75 బేసిస్ పాయింట్లు అంటే 0.75 శాతం అదనపు వడ్డీ అన్నమాట. చిన్న మొత్తంగా కనిపించినా దీర్ఘకాలిక పెట్టుబడుల్లో ఈ అదనపు వడ్డీ మంచి రాబడిని అందిస్తుంది.

ఏ బ్యాంకులో ఎంత వడ్డీ లభిస్తోంది.?

అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో గరిష్టంగా 8.50 శాతం వరకు వడ్డీ లభించే అవకాశం ఉంది. అలాగే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో గరిష్టంగా 8.30 శాతం, డీసీబీ బ్యాంక్‌లో 8 శాతం, బంధన్ బ్యాంక్‌లో 7.95 శాతం వరకు వడ్డీ అందుతోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 7.90 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిశీలిస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.45 శాతం వరకు, ఇండియన్ బ్యాంక్‌లో 7.15 శాతం, కెనరా బ్యాంక్‌లో 7.10 శాతం వరకు వడ్డీ లభించవచ్చు.

కేవలం ఎక్కువ వడ్డీ చూసి FD చేయొద్దు..

FD ఎంపిక చేసుకునే సమయంలో కేవలం గరిష్ట వడ్డీ రేటును మాత్రమే చూడటం సరైన నిర్ణయం కాదు. ఆ వడ్డీ ఎంత కాలపరిమితి ఉన్న FDకి వర్తిస్తుందో ముందుగా తెలుసుకోవాలి. ఒక ఏడాది, మూడు సంవత్సరాలు, ఐదేళ్లు వంటి కాలపరిమితులకు వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉండొచ్చు. అలాగే అత్యవసర సమయంలో FDని మధ్యలోనే రద్దు చేస్తే ఎంత పెనాల్టీ పడుతుంది.? అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. బ్యాంకు విశ్వసనీయత, డిపాజిట్ కాలపరిమితి, వడ్డీ చెల్లించే విధానం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.

వృద్ధాప్యంలో FD ఎందుకు మంచి ఎంపిక.?

FDలో పెట్టుబడి పెట్టిన తర్వాత షేర్ మార్కెట్ మాదిరిగా ప్రతిరోజూ మార్కెట్ పరిస్థితులను గమనించాల్సిన అవసరం ఉండదు. మార్కెట్ ఒడిదొడుకుల ప్రభావం కూడా పెద్దగా ఉండదు. పెట్టుబడి పెట్టే సమయంలోనే ఎంత వడ్డీ వస్తుందో స్పష్టత ఉంటుంది. అందుకే స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు FD ఉపయోగకరంగా ఉంటుంది. తమ పొదుపులో కొంత మొత్తాన్ని నిర్ణీత కాలానికి FDలో ఉంచడం ద్వారా సురక్షితంగా వడ్డీ ఆదాయం పొందవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి, తమ అవసరాలకు సరిపోయే కాలపరిమితిని ఎంచుకోవడం ఉత్తమం.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story