September Rule Changes: నేటి నుంచి కొత్త రూల్స్.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే
September Rule Changes: ఈ కొత్త నెల ఆరంభంతోనే సామాన్యుల జేబులతో పాటు ఇన్వెస్టర్లు, పన్ను చెల్లింపుదారులపై నేరుగా ప్రభావం చూపే పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనలు మారిపోయాయి.
September Rule Changes
September Rule Changes: సెప్టెంబర్ నెల రానే వచ్చింది. ఈ కొత్త నెల ఆరంభంతోనే సామాన్యుల జేబులతో పాటు ఇన్వెస్టర్లు, పన్ను చెల్లింపుదారులపై నేరుగా ప్రభావం చూపే పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనలు మారిపోయాయి. అంతర్జాతీయ ప్రయాణాలు, అడ్వాన్స్ టాక్స్ చెల్లింపులు, ఆటోమొబైల్ ధరల దాకా అమలులోకి వచ్చిన మార్పుల వివరాలు తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను, అడ్వాన్స్ టాక్స్ కీలక గడువులు
పన్ను చెల్లింపుదారులు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవాలి. ఆగస్టు 31తో సాధారణ ఐటీఆర్ దాఖలు గడువు ముగియగా, టాక్స్ ఆడిట్ అవసరమైన వారికి అక్టోబర్ 31 వరకు సమయం ఉంది. ఆగస్టు నెలకు సంబంధించిన టిడిఎస్, టిసిఎస్ చెల్లింపులకు సెప్టెంబర్ 7 చివరి తేదీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండవ విడత అడ్వాన్స్ టాక్స్ చెల్లించడానికి సెప్టెంబర్ 15 గడువుగా నిర్ణయించారు. నెలకు సంబంధించిన జిఎస్‌టిఆర్-1 కు సెప్టెంబర్ 11, జిఎస్‌టిఆర్-3బి దాఖలుకు సెప్టెంబర్ 20 ఆఖరి రోజులు.
విదేశీ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్, ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్ మార్పులు
విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ తీపి కబురు అందించింది. బోర్డింగ్ పాస్‌లపై ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద ముద్రలు వేసే విధానానికి స్వస్తి పలికారు. ప్రయాణికులు తమ మొబైల్‌లోని ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్ చూపించి నేరుగా వెళ్లవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం నాన్-రెసిడెంట్ డిపాజిట్లకు ఇచ్చే ప్రత్యేక డాలర్-రూపాయి స్వాప్ సదుపాయం ఆగస్టు 31తో ముగిసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్రత్యేక ప్రయోజనం లభించదు.
టాటా కార్ల ధరల పెంపు, స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు
టాటా మోటార్స్ తమ ప్రయాణీకుల వాహనాల ధరలను రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లన్నింటికీ ఈ ధరల పెంపు వర్తిస్తుంది. అటు వైపు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికి సెప్టెంబర్ 30 అత్యంత ప్రాధాన్యమైన రోజు. అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరున ప్రకటించనుంది.
ఎస్‌జీబీ రిడెంప్షన్, డీమ్యాట్ నామినేషన్ నిబంధనలు
సావరేన్ గోల్డ్ బాండ్ల కాలపరిమితి తీరకముందే విక్రయించాలనుకునే వారికి సెప్టెంబర్ నెలలో ప్రత్యేక విండోలు అందుబాటులోకి వస్తున్నాయి. 2019, 2020 సిరీస్ బాండ్ల హోల్డర్లు సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెబి మార్గదర్శకాల ప్రకారం డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్ ఖాతాల్లో నామినేషన్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. సెప్టెంబర్ 7 నుంచి ఈటీఎఫ్ ట్రేడింగ్ ప్రాసెస్, బేస్ ప్రైస్, ప్రైస్ బ్యాండ్లలో నూతన విధివిధానాలు అమలులోకి రానున్నాయి.
ఈ కొత్త ఆర్థిక నిబంధనలు సగటు పౌరుడి బడ్జెట్‌తో పాటు పెట్టుబడి ప్రణాళికలపై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా సంబంధిత డెడ్‌లైన్లను గమనించి ముందే పనులు పూర్తి చేసుకోవడం ఉత్తమం.




