SIP: ఎస్ఐపీ చేసేవాళ్లలో చాలా మంది చేసే తప్పు ఇదే.. మీరు కూడా ఈ జాబితాలోనే ఉన్నారా.?
SIP: మ్యూచువల్ ఫండ్లలో సిప్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టేవారికి కొన్నిసార్లు నిరాశ ఎదురవుతుంది. నెలనెలా డబ్బులు జమ చేస్తున్నా, రెండేళ్ల తర్వాత ఖాతాలో ఆశించిన లాభాలు కనిపించకపోవచ్చు.
SIP: ఎస్ఐపీ చేసేవాళ్లలో చాలా మంది చేసే తప్పు ఇదే.. మీరు కూడా ఈ జాబితాలోనే ఉన్నారా.?
SIP: మ్యూచువల్ ఫండ్లలో సిప్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టేవారికి కొన్నిసార్లు నిరాశ ఎదురవుతుంది. నెలనెలా డబ్బులు జమ చేస్తున్నా, రెండేళ్ల తర్వాత ఖాతాలో ఆశించిన లాభాలు కనిపించకపోవచ్చు. మార్కెట్ పడిపోయినప్పుడు పెట్టిన మొత్తమే తగ్గినట్లు కనిపించవచ్చు. దీంతో చాలా మంది విత్‌డ్రా చేస్తుంటారు.
రెండేళ్లలో నష్టాలు వచ్చినా..
ప్రస్తుతం నిఫ్టీ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్ (TRI) ఆధారంగా చూస్తే ఏడాది, రెండేళ్ల సిప్ రాబడులు దాదాపు సున్నా స్థాయిలో లేదా ప్రతికూలంగా ఉన్నాయి. అయితే గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. గత 20 ఏళ్లలో రెండేళ్ల సిప్ రాబడి సున్నా లేదా అంతకంటే తక్కువగా నమోదైన 32 సందర్భాలను ఫోన్‌పే వెల్త్ విశ్లేషించింది. ఆ పెట్టుబడులను మరో మూడేళ్లు కొనసాగించి, మొత్తం ఐదేళ్ల పనితీరును పరిశీలించినప్పుడు 53.1 శాతం సందర్భాల్లో వార్షిక రాబడి 15-20 శాతం మధ్య నమోదైంది. ముఖ్యంగా పరిశీలించిన 32 సందర్భాల్లోనూ ఐదేళ్ల ముగింపులో ప్రతికూల రాబడి కనిపించలేదు. ఈ గణాంకాలు ప్రతి సిప్‌కూ లాభాలు వస్తాయని హామీ ఇవ్వవు. అయితే రెండేళ్ల ఫలితాలనే చూసి పెట్టుబడి భవిష్యత్తును నిర్ణయించకూడదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్లు.. సిప్‌లో రూపాయి సగటు ప్రయోజనం
సిప్ విధానంలో మార్కెట్ హెచ్చుతగ్గులు ఒక విధంగా ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల యూనిట్ ధర తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. ధరలు పెరిగినప్పుడు గతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన యూనిట్ల విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
దీనినే రూపాయి వ్యయ సగటు ప్రయోజనం (Rupee Cost Averaging) అంటారు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో ముందుగా అంచనా వేయడం కష్టం. కాబట్టి, ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టడం కంటే క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా కొనుగోలు ధరల్లోని హెచ్చుతగ్గుల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే మార్కెట్ నిరంతరం పడిపోతే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
పెట్టుబడికి సమయం ఇస్తే నష్టభయం తగ్గే అవకాశం
ఫోన్‌పే వెల్త్ విశ్లేషణ ప్రకారం, సిప్ పెట్టుబడుల కాలవ్యవధి పెరిగే కొద్దీ ప్రతికూల రాబడులు వచ్చే అవకాశం తగ్గినట్లు చారిత్రక గణాంకాలు సూచిస్తున్నాయి. ఐదేళ్ల పెట్టుబడి కాలంలో నష్టంతో ముగిసే అవకాశం సుమారు 1 శాతంగా నమోదైంది. ఏడేళ్ల నుంచి పదేళ్ల కాలవ్యవధిలో ప్రతికూల రాబడి వచ్చే అవకాశం సున్నా శాతంగా ఉన్నట్లు విశ్లేషణ పేర్కొంది. పదేళ్ల సిప్‌లలో సుమారు 90 శాతం సందర్భాల్లో రెండంకెల వార్షిక రాబడులు నమోదయ్యాయి. ఇవి గత మార్కెట్ గణాంకాల ఆధారంగా వచ్చిన ఫలితాలు మాత్రమే. భవిష్యత్తులోనూ ఇదే విధమైన రాబడులు వస్తాయని భావించకూడదు. పెట్టుబడులపై మార్కెట్ పరిస్థితులు, ఫండ్ ఎంపిక, పెట్టుబడి కాలం ప్రభావం చూపుతాయి.
సిప్ కొనసాగించాలా? ఫండ్ ఎంపికలో ఏం పరిశీలించాలి?
రెండేళ్లుగా ఆశించిన రాబడులు రావడం లేదని వెంటనే సిప్‌ను ఆపేయడం కంటే, ముందుగా తమ పెట్టుబడి లక్ష్యాలను సమీక్షించుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడి ఎందుకు చేస్తున్నారు? ఎంతకాలం కొనసాగించగలరు? మార్కెట్ నష్టాలను ఎంతవరకు భరించగలరు? అనే అంశాలను పరిశీలించాలి. ఫండ్ ఎంపికలో గత ఆరు నెలలు లేదా ఏడాది రాబడులకే పరిమితం కాకుండా, ఐదేళ్ల పనితీరు, రాబడుల్లో స్థిరత్వం, ఇతర సమానమైన ఫండ్లతో పోలిక, పెట్టుబడి విధానం, నష్టభయం వంటి అంశాలను గమనించాలి.
దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెడుతున్నవారు స్వల్పకాలిక మార్కెట్ మార్పుల ఆధారంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ముఖ్యం. అదే సమయంలో, నష్టాలను భరించే సామర్థ్యం తగ్గినా లేదా ఆర్థిక అవసరాలు మారినా పెట్టుబడి ప్రణాళికను తిరిగి సమీక్షించుకోవాలి.
మొత్తం మీద సిప్ అనేది త్వరగా లాభాలు పొందే మార్గం కాదు. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం, సరైన ఫండ్‌ను ఎంచుకోవడం, లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడి కాలాన్ని నిర్ణయించుకోవడం ముఖ్యం.




