Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో టెక్ కంపెనీ.. 20 శాతం సిబ్బందిపై వేటు..!

Snap Inc Layoffs 2026: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. తాజాగా స్నాప్ ఇంక్ తన వర్క్‌ఫోర్స్‌లో 20% మందిని తొలగించేందుకు సిద్ధమైంది.

Naresh.k
Published on: 16 April 2026 8:31 AM IST
Snap Inc Layoffs 2026: Snapchat Parent to Cut 20% of Workforce Amid AI Shift
X

Snap Inc Layoffs 2026

Snap Inc: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర ఒక అంతం లేని కథలా మారుతోంది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే జీవితాంతం స్థిరత్వం అనుకునేవారు, కానీ ఇప్పుడు ఏ క్షణంలో ఏ మెయిల్ వస్తుందో అని వణికిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం స్నాప్‌చాట్ కూడా ఇదే బాటలో పయనిస్తూ వేల మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో, పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ కంపెనీలు తమ రూపురేఖలను మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అమెరికన్ టెక్ సంస్థ స్నాప్ ఇంక్ తన వర్క్‌ఫోర్స్‌లో ఏకంగా 15 నుండి 20 శాతం మేర కోత విధించాలని నిర్ణయించింది.

కీలక అంశాలు

సుమారు 750 నుండి 1000 మంది ఉద్యోగులను తొలగించడానికి స్నాప్ ఇంక్ రెడీ అవుతుంది. ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని టీమ్‌లలో ఈ సంఖ్య సగానికి పైగా ఉండవచ్చు. పాత బిజినెస్ మోడల్ నుండి నిధులను మళ్లించి, ఆగ్మెంటెడ్ రియాల్టీ, స్పెక్స్ విభాగంపై పెట్టుబడులు పెంచడమే కంపెనీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

ఉద్యోగుల పాలిట గండం

కేవలం స్నాప్ మాత్రమే కాదు, 2026 సంవత్సరం టెక్ రంగానికి ఒక గండంలా మారింది. గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది: ఈ ఏడాదిలో ఇప్పటివరకు 231 టెక్ కంపెనీలు దాదాపు 91,000 మందిని ఇంటికి పంపించాయి. ఒరాకిల్ ఏకంగా 30,000 మందిపై వేటు వేసి రికార్డు సృష్టించింది. మెటా ,అమెజాన్: ఈ దిగ్గజాలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించి, తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి.

ఎందుకీ కోతలు? కంపెనీల లెక్కలేంటి?

ఉద్యోగుల తొలగింపు వెనుక ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మనుషులు చేసే పనులను ఏఐ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో వేగంగా చేయించుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీగా నిధులు అవసరం కావడంతో, ఆ ఖర్చును ఉద్యోగుల జీతాల నుంచి సర్దుబాటు చేస్తున్నాయి. స్నాప్ విషయానికొస్తే.. పర్‌ప్లెక్సిటీ ఏఐతో జరగాల్సిన 400 మిలియన్ డాలర్ల డీల్ రద్దు కావడం కంపెనీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపింది. కోవిడ్ సమయంలో డిజిటల్ వినియోగం పెరగడంతో అప్పట్లో భారీగా నియామకాలు జరిపారు. ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో ఆ 'అదనపు' భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఉద్యోగికి తప్పని అనిశ్చితి

టెక్ దిగ్గజాలు తమ లాభాల వేటలో పునర్వ్యవస్థీకరణ పేరుతో సామాన్య ఉద్యోగి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకప్పుడు డ్రీమ్ కంపెనీలుగా భావించిన సంస్థలే ఇప్పుడు నిలువునా ముంచుతుండటంతో, టెక్ నిపుణులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ కొత్త మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Naresh.k

Naresh.k

Next Story