Gold Bond: కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్స్..లక్ష పెడితే రూ. 5 లక్షలు..!
Gold Bond: బంగారం ధరల పెరుగుదల సావరిన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు వరంగా మారింది.
Gold Bond: కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్స్..లక్ష పెడితే రూ. 5 లక్షలు..!
Gold Bond Scheme: బంగారం.. భారతీయులకు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే అండ. అయితే, అదే బంగారాన్ని ఒక పెట్టుబడిగా చూసి సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు ఆర్బీఐ కళ్లు చెదిరే లాభాలను పంచింది. కేవలం ఏడేళ్ల కాలంలోనే పెట్టుబడికి దాదాపు 5 రెట్లు లాభం రావడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఏమిటీ మ్యాజిక్?
2018-19 కాలంలో బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం సిరీస్-II బాండ్లను విడుదల చేసింది. అప్పట్లో నమ్మకంతో పెట్టుబడి పెట్టిన వారికి, ఇప్పుడు పెరిగిన బంగారం ధరలు వజ్రాల లాభాలను తెచ్చిపెట్టాయి. తాజాగా ఆర్బీఐ ప్రకటించిన ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ చూసి ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు.
లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
ఒకసారి అప్పటి ధరలను, ఇప్పటి రిటర్న్స్‌ను బేరీజు వేస్తే ఆశ్చర్యం కలగక మానదు.అప్పట్లో ఒక గ్రాము గోల్డ్ బాండ్ ధర కేవలం రూ. 3,146. ఆన్లైన్లో కొన్నవారికి డిస్కౌంట్‌తో అది రూ. 3,096 కే లభించింది.తాజాగా ఆర్బీఐ నిర్ణయించిన ధర గ్రాముకు ఏకంగా రూ. 15,219. కేవలం గ్రాముపైనే రూ. 12,123 లాభం వచ్చింది. అంటే సుమారు 392 శాతం పెరుగుదల. గోల్డ్ బాండ్ల ప్రత్యేకత కేవలం బంగారం ధర పెరగడమే కాదు, దీనిపై ప్రభుత్వం ఇచ్చే 2.50% వార్షిక వడ్డీ. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఏటా రూ. 2,500 చొప్పున, ఈ ఏడేళ్లలో దాదాపు రూ. 17,500 వడ్డీ రూపంలోనే లభించాయి. మొత్తంగా చూస్తే, 2018లో పెట్టిన రూ. 1 లక్ష పెట్టుబడి, నేడు వడ్డీతో కలిపి రూ. 5.10 లక్షల మార్కును చేరుకుంది.
ఎందుకు ఇంత సక్సెస్ అయింది?
ఇది ప్రభుత్వం జారీ చేసే బాండ్ కాబట్టి మోసం జరిగే అవకాశమే లేదు. ఫిజికల్ గోల్డ్ కొంటే వడ్డీ రాదు, కానీ బాండ్లపై వడ్డీ వస్తుంది. తరుగు, మజూరీ లేదా లాకర్ ఛార్జీల గోల అస్సలు ఉండదు. మెచ్యూరిటీ వరకు బాండ్లను ఉంచుకుంటే, వచ్చే లాభంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. ప్రస్తుతం అంతర్జాతీయ అనిశ్చితి వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని భారీ లాభాలతో విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఒకప్పుడు సాదాసీదాగా అనిపించిన ఈ ప్రభుత్వ పథకం, నేడు మధ్యతరగతి ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా నిలిచింది.




