Stock Market: ఇన్వెస్టర్లకు బిగ్ అలెర్ట్ ..వరుసగా 3 రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవు.. కారణం ఇదే!
Stock Market: మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు , కమొడిటీ మార్కెట్లు మూతపడనున్నాయి.
Stock Market
Stock Market Holidays 2026: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక. ఈ వారం ట్రేడింగ్‌కు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ శుక్రవారం అంటే మే 1వ తేదీన భారత స్టాక్ మార్కెట్లు పనిచేయవు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి , నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి రెండింటికీ సెలవు ప్రకటించారు. దీనివల్ల ఈ వారం ట్రేడింగ్ కేవలం నాలుగు రోజులకే పరిమితం కానుంది.
వరుస సెలవుల సందడి
సాధారణంగా మే 1 అనగానే మనకు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే) గుర్తొస్తుంది. అయితే, భారతీయ స్టాక్ ఎక్స్చేంజీలు ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుండటంతో, అక్కడ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అధికారిక సెలవును ఇచ్చారు. శుక్రవారం సెలవు కావడం, ఆ తర్వాత శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో వరుసగా మూడు రోజుల పాటు మార్కెట్లు మూతపడనున్నాయి. మళ్ళీ సోమవారం ఉదయమే ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. ఈ సుదీర్ఘ విరామాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకోవడం ఉత్తమం.
ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లోనూ విరామం
కేవలం స్టాక్ మార్కెట్లు మాత్రమే కాకుండా, దేశంలోని అతిపెద్ద కమొడిటీ ఎక్స్చేంజి అయిన మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కూడా మహారాష్ట్ర దినోత్సవం రోజున పని చేయదు. అదేవిధంగా నేషనల్ కమొడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ కూడా సెలవు పాటిస్తుంది. సాధారణ రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు సాగే కమొడిటీ ట్రేడింగ్‌కు ఈ శుక్రవారం బ్రేక్ పడనుంది.
2026 క్యాలెండర్లో మిగిలిన సెలవులు ఇవే..
ఈ ఏడాది మొత్తంగా 16 స్టాక్ మార్కెట్ సెలవులను నిర్ణయించగా, ఇప్పటికే 7 సెలవులు పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలలో గుడ్‌ఫ్రైడే , అంబేడ్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లు విరామం తీసుకున్నాయి. ఇక మే 1వ తేదీ నుంచి డిసెంబర్ వరకు మరో 9 సెలవులు రాబోతున్నాయి. ఆ జాబితాను పరిశీలిస్తే.. మే నెలలో మహారాష్ట్ర దినోత్సవం తర్వాత, మే 28న బక్రీద్ సందర్భంగా సెలవు ఉంటుంది. జూన్ 26న మొహర్రం, సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి వేడుకల సందర్భంగా మార్కెట్లు మూతపడతాయి.
అక్టోబర్ మాసంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 20న దసరా పండుగను పురస్కరించుకుని ట్రేడింగ్ నిలిచిపోతుంది. నవంబర్ నెలలో దీపావళి సందర్భంగా నవంబర్ 10న, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 24న సెలవులు ఉన్నాయి. ఇక ఏడాది చివరలో డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజున చివరి సెలవు ఉంటుంది. వరుసగా మూడు రోజులు మార్కెట్లు అందుబాటులో ఉండవు కాబట్టి, ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిది.




