Stock Market: రాకెట్‌లా దూసుకెళ్లిన అంబానీ షేర్లు.. ఇన్వెస్టర్లకు పండగే!
Stock Market: అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి.
Stock Market: రాకెట్‌లా దూసుకెళ్లిన అంబానీ షేర్లు.. ఇన్వెస్టర్లకు పండగే!
Mukesh Ambani: భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి. పశ్చిమాసియాలో అంతర్జాతీయ ఉద్రిక్తతలు భయపెడుతున్నప్పటికీ, మన దేశీయ సూచీలు మాత్రం తగ్గేదేలేదంటూ లాభాల జైత్రయాత్రను కొనసాగిస్తున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్లు ఆరంభం నుంచే భారీ లాభాలతో హోరెత్తాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు 700 నుంచి 800 పాయింట్ల లాభంతో సాగిన సెన్సెక్స్, మధ్యాహ్నం 2:20 గంటల సమయానికి ఏకంగా 1000 పాయింట్లకు పైగా ఎగబాకి 78,150 మార్కును దాటేసింది. అటు నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా పుంజుకుని 24,300 మార్కు పైన ట్రేడవుతూ ఇన్వెస్టర్లలో జోష్ నింపింది.
ఈ భారీ ఊపుకు ప్రధానంగా ఐటీ , హెవీవెయిట్ స్టాక్స్ దన్నుగా నిలిచాయి. ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా 4 శాతానికి పైగా పరుగులు పెట్టగా, టీసీఎస్ 3 శాతానికి పైగా పుంజుకుంది. దేశంలోనే అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2 శాతానికి పైగా పెరగ్గా, బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కూడా 2 శాతం లాభంతో మార్కెట్లకు మంచి బూస్ట్ ఇచ్చాయి.
మార్కెట్ లాభాల జోరులో దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంట్రాడేలో ఈ షేరు ఏకంగా 6 శాతానికి పైగా దూసుకెళ్లింది. కిందటి సెషన్‌లో రూ. 235.65 వద్ద ముగిసిన ఈ స్టాక్, శుక్రవారం ఉదయం ఏకంగా 5 శాతానికి పైగా లాభంతో రూ. 247.50 వద్ద ఓపెన్ అయింది. ట్రేడింగ్ మధ్యలో మరింత జోరు పెంచి రూ. 249.95 వద్ద సరికొత్త సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం ఈ షేరు 4 శాతం లాభంతో రూ. 244 సమీపంలో కొనసాగుతోంది. ఈ అకస్మాత్తు పెరుగుదలతో ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు లాభాలతో కళకళలాడుతున్నాయి.
ప్రస్తుతం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ విలువ రూ. 1.55 లక్షల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 338.60 కాగా, కనిష్ఠ ధర రూ. 223.30 గా ఉంది. గత ఆరు నెలల్లో 12 శాతం, ఏడాది కాలంలో 24 శాతం మేర నష్టపోయిన ఈ షేరు, ఇప్పుడు ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకెళ్లడానికి ఒక బలమైన కారణం ఉంది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను తలకిందులు చేశాయి. కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా 150 శాతం పెరిగి రూ. 830 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది తొలి త్రైమాసికంలో ఈ లాభం కేవలం రూ. 325 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
మరోవైపు కంపెనీ ఆదాయం కూడా మూడింతలకు పైగా పెరిగి రూ. 619 కోట్ల నుంచి ఏకంగా రూ. 2,005 కోట్లకు చేరింది. కంపెనీ సాధించిన వడ్డీ ఆదాయం సైతం 200 శాతానికి పైగా వృద్ధి చెంది రూ. 962 కోట్లుగా నమోదైంది. ఈ అద్భుతమైన ఆర్థిక ప్రదర్శనతో ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్‌ను పెంచేశాయి. దీంతో మార్కెట్లో ఈ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడిపోయి 2023లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.. ప్రస్తుతం పేమెంట్ బ్యాంక్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, ఫైనాన్సింగ్, పెట్టుబడులు వంటి రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఇదిలా ఉంటే, మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తన క్యూ1 ఫలితాలను విడుదల చేయనుండటంతో మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.




