Finance: 30 మంది, రూ. 100 కోట్లు.. ఇన్వెస్టర్లకు తెలియకుండా షేర్లు మాయం..!

Finance: బెంగళూరు ఫిన్‌టెక్ కంపెనీ స్టాక్‌అల్‌లో 30 మంది ఇన్వెస్టర్ల US షేర్లు వారికి తెలియకుండా అమ్మేశారని, రూ. 100 కోట్ల నష్టమని ఆరోపిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 4 Nov 2026 6:20 PM IST
Finance
X

Finance: 30 మంది, రూ. 100 కోట్లు.. ఇన్వెస్టర్లకు తెలియకుండా షేర్లు మాయం..!

Finance: బెంగళూరు ఫిన్‌టెక్ కంపెనీ స్టాక్‌అల్(Stockal)లో రూ.100 కోట్ల స్కామ్ కలకలం రేపింది. ఇన్వెస్టర్లకు తెలియకుండా వారి షేర్లు విక్రయించింది. US కంపెనీల్లో ఇండియన్స్ షేర్లు కొనేందుకు 'స్టాక్‌అల్' బ్రోకరేజ్ చేస్తుంది. టెస్లా, యాపిల్, అమెజాన్ వంటి టాప్ కంపెనీల్లోని షేర్లను అమ్మేసి చైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. దీంతో తమ లైఫ్‌టైమ్ సేవింగ్స్ కోల్పోయామని 30 మంది ఇండియా ఇన్వెస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన అక్టోబర్ 15న జరిగినట్లు ఇన్వెస్టర్లు చెబుతున్నారు. యాపిల్, ఎన్‌విడియా, అమెజాన్, టెస్లా, ఆల్ఫాబెట్, AMD వంటి కంపెనీల షేర్లను అమ్మేశారని ఆరోపిస్తున్నారు. వచ్చిన డబ్బుతో చైనాకు చెందిన, నాస్‌డాక్‌లో లిస్టయిన జిబావో టెక్నాలజీ (ZBAO) షేర్లను కొన్నారని తెలిపారు. ఈ కంపెనీ షేర్లు తక్కువగా ట్రేడ్ అవుతాయి, ధరలు వేగంగా మారుతుంటాయి. సగటున 1.05 డాలర్ల ధరకు కొన్న ఈ షేర్లు కొద్ది రోజుల్లోనే సుమారు 60% పడిపోయాయి.

ఒక్కో ఇన్వెస్టర్ నష్టం భారీగా ఉంది. ఓ ప్రముఖ శీతల పానీయాల కంపెనీ సీనియర్ అధికారికి చెందిన 10 ప్రధాన US షేర్లు సుమారు 3.36 లక్షల డాలర్లకు అమ్ముడయ్యాయి. ఆ మొత్తంతో 3 లక్షల జిబావో షేర్లు కొన్నారు. మరో ఖాతాలో సుమారు 31 లక్షల డాలర్ల (రూ. 29 కోట్ల) షేర్లను విక్రయించి, 15 నిమిషాల్లోనే 30.5 లక్షల జిబావో షేర్లు కొన్నారని ఆరోపణ. కొందరు ఇన్వెస్టర్లు 4.5 లక్షల డాలర్ల (రూ. 4.26 కోట్లు) వరకు నష్టపోయినట్లు చెబుతున్నారు.

బాధితుల్లో ఒకరు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఆ FIRలో డ్రైవ్‌వెల్త్ ఎల్ఎల్‌సీ, స్టాక్‌అల్ సెక్యూరిటీస్, బోర్డర్‌లెస్ సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, బోర్డర్‌లెస్ ఇన్వెస్టింగ్ ఇంక్, HDFC సెక్యూరిటీస్‌ల పేర్లు ఉన్నాయి. బాధితులు సెబీ, అమెరికా SECనూ ఆశ్రయించి, జోక్యం చేసుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.

స్టాక్‌అల్ మాతృ సంస్థ బోర్డర్‌లెస్ దీనిపై స్పందించింది. అక్టోబర్ 15న 26 ఖాతాలను సరైన లాగిన్ వివరాలతో ఎవరో యాక్సెస్ చేశారని, అందులో 13 ఖాతాల్లో అనధికార ట్రేడ్స్ జరిగాయని చెప్పింది. ఇప్పటివరకు చేసిన సమీక్షలో తమ ప్లాట్‌ఫామ్‌లో హ్యాక్ జరిగినట్లు ఆధారాలు దొరకలేదని మనీకంట్రోల్‌కు పంపిన ఈమెయిల్‌లో పేర్కొంది. అనధికార వ్యక్తి ఖాతాల నుంచి డబ్బు తీసుకోలేదని కూడా తెలిపింది. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై విచారణ కొనసాగుతోందని వివరించింది.

అమెరికా క్లియరింగ్ బ్రోకర్ డ్రైవ్‌వెల్త్ మాత్రం బాధ్యతను తిరస్కరించింది. అక్టోబర్ 30న ఓ ఇన్వెస్టర్‌కు రాసిన లేఖలో, అనధికార యాక్సెస్ స్టాక్‌అల్ ఇంటర్‌ఫేస్ ద్వారా జరిగిందని, ఆ కార్యకలాపం తమ వద్ద మొదలు కాలేదని తెలిపింది. ప్లాట్‌ఫామ్ భద్రతా లోపాలకు స్టాక్‌అల్‌దే బాధ్యత అని పేర్కొంది. ఘటన తర్వాత స్టాక్‌అల్‌ను తగిన వేగంతో స్పందించలేదని కూడా విమర్శించింది. స్టాక్‌అల్ సూచనల మేరకు ప్రభావిత ఖాతాను ఫ్రీజ్ చేశామని తెలిపింది. ఈ విషయంలో సెబీ, డ్రైవ్‌వెల్త్, HDFC సెక్యూరిటీస్ నుంచి మీడియాకు ఇంకా స్పందన రాలేదు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.