Sugar Price: బంగారం తర్వాత పంచదారేనా? రికార్డు స్థాయికి షుగర్ ధరలు

పంచదార ధరల పెరుగుదలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద వ్యాపారులు, పరిశ్రమలు ఇక 15 రోజుల నిల్వలకే పరిమితం కావాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Aug 2026 2:30 AM IST
Sugar Price
X

Sugar Price

దేశంలో పంచదార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో కృత్రిమ కొరత, అక్రమ నిల్వలను అరికట్టేందుకు పంచదార నిల్వలపై కొత్త పరిమితులను విధించింది. నెలకు 10 మెట్రిక్ టన్నులకు మించి పంచదారను వినియోగించే లేదా విక్రయించే పెద్ద వ్యాపారులు, పరిశ్రమలు ఇకపై తమ వద్ద 15 రోజులకు సరిపడా నిల్వలను మాత్రమే ఉంచుకోవాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

గతంలో ఈ నిల్వ పరిమితి 30 రోజులుగా ఉండేది. అయితే మార్కెట్లో పంచదార ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వం నిల్వల పరిమితిని సగానికి తగ్గించింది. కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

పంచదార ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

దేశీయ మార్కెట్లో పంచదార ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. గత ఏడాది పంచదార మిల్లు ధర క్వింటాల్‌కు సుమారు రూ.3,900 ఉండగా, ప్రస్తుతం రూ.5,400–రూ.5,500 స్థాయికి చేరినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రిటైల్ మార్కెట్లోనూ ధరల పెరుగుదల కనిపిస్తోంది. కిలో పంచదార ధర రూ.52 దాటడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండగలు వరుసగా వస్తుండటంతో స్వీట్లు, పిండివంటలు, బేకరీ ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

చెరకు దిగుబడి తగ్గడంతో సమస్య

ఈ ఏడాది చెరకు సాగు ప్రాంతాల్లో వర్షపాతం సక్రమంగా లేకపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా దిగుబడి తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్‌లో దేశీయ అవసరాలకు సరిపడా పంచదార అందుబాటులో ఉంటుందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దేశీయంగా సుమారు 50 లక్షల టన్నుల పంచదార నిల్వలు అవసరమని అంచనా ఉండగా, ప్రస్తుతం ప్రారంభ నిల్వలు 32 నుంచి 42 లక్షల టన్నుల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అక్రమ నిల్వలకు చెక్

స్వీట్లు, బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తుల తయారీదారుల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో పంచదార నిల్వ చేయకుండా నియంత్రించడమే తాజా నిర్ణయం లక్ష్యంగా కనిపిస్తోంది. పంచదార అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత పెద్ద వ్యాపారులు, పరిశ్రమల వద్ద ఉన్న పంచదార నిల్వలపై పర్యవేక్షణ మరింత పెరగనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story