Tati Munjalu: వేసవి అమృతం.. ఐస్ ఆపిల్.. మీ ఆరోగ్యానికే కాదు, జేబుకు కూడా లాభమే..!

వేసవి తాపాన్ని తగ్గించే తాటి ముంజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు , వీటి ద్వారా ఆదాయం పొందే మార్గాల గురించి తెలుసుకోండి.

Naresh.k
Published on: 30 April 2026 1:51 PM IST
Tati Munjalu Sales
X

Tati Munjalu Sales

Summer Business : ఎండలు ముదురుతుంటే చాలు.. రోడ్ల పక్కన బండ్ల మీద తెల్లటి ముంజల రాశులు కనిపిస్తాయి. వీటిని చూడగానే నోరూరుతుంది. అందుకే వీటిని ఐస్ ఆపిల్ అని పిలుస్తారు. పల్లెటూళ్లలో గట్ల వెంట ఫ్రీగా దొరికే ఈ ముంజల కోసం నేడు నగరవాసులు పోటీ పడుతున్నారు. సిటీలో మండుతున్న ఎండలకు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌ల కంటే ముంజలకే జనం జై కొడుతున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచే ముంజల బండ్ల దగ్గర క్యూ కనిపిస్తోంది. ప్యాకెట్ల రూపంలో దొరికే కృత్రిమ పానీయాల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే ఈ ముంజలే ఉత్తమమని నగర ప్రజలు భావిస్తున్నారు. అందుకే డజను ఎంత ధర చెప్పినా ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. సిటీలోని ప్రధాన చౌరస్తాల్లో, హైవేల పక్కన ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

ఆరోగ్య ప్రదాయిని.. ఈ ముంజల నీరు

ముంజలు కేవలం రుచి కోసమే కాదు, శరీరానికి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. వేసవిలో పెరిగే శరీర ఉష్ణోగ్రతను ముంజలు తగ్గిస్తాయి. వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. వీటిలో పొటాషియం, ఐరన్, కాల్షియం ,విటమిన్-ఎ, బి వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారికి ముంజలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎండ వల్ల వచ్చే చెమటకాయలు, దద్దుర్ల సమస్యకు ముంజల ముక్కలను రుద్దడం వల్ల ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.

లాభాల బాట

ముంజలు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అండగా నిలుస్తాయి. నేడు వీటి డిమాండ్‌ను బట్టి చూస్తే, ఇది ఒక మంచి స్వయం ఉపాధి మార్గంగా మారింది. గ్రామాల్లో తక్కువ ధరకు తాటి వనాలను కౌలుకు తీసుకోవడం లేదా రైతుల నుంచి నేరుగా చెట్లను కొనుగోలు చేసి, వాటిని నగరాలకు తరలించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ముంజలను నేరుగా గెలలతో కాకుండా, నీట్ గా తీసి మంచి ప్యాకింగ్ ద్వారా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ , సూపర్ మార్కెట్లకు సరఫరా చేస్తే ఆదాయం రెట్టింపు అవుతుంది. కేవలం ముంజలుగానే కాకుండా.. ముంజల షేక్స్, ముంజల హల్వా, , తాటి ముంజల జ్యూస్ వంటి వెరైటీ ఫుడ్స్ పరిచయం చేస్తే నగరాల్లో వీటికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story