స్విగ్గీకి క్యూ2లో భారీ షాక్.. రూ. 922 కోట్ల నష్టం, పడిపోయిన షేరు ధర
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ (Swiggy) ప్రకటించిన సెప్టెంబర్ త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లలో తీవ్ర తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. క్యూ2లో..
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ (Swiggy) ప్రకటించిన సెప్టెంబర్ త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లలో తీవ్ర తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. క్యూ2లో కంపెనీ ఏకంగా రూ. 922 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాన్ని నమోదు చేయడంతో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో శుక్రవారం బీఎస్‌ఈ (BSE)లో స్విగ్గీ షేరు ధర ఇంట్రాడేలో 17.22 శాతం వరకు క్షీణించి, 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ. 174.90కి పడిపోయింది. ఆ తర్వాత కొంత కోలుకుని రూ. 181 వద్ద ట్రేడైంది.
ఆదాయం పెరిగినా మార్కెట్ అంచనాలు నమోదు కాక పతనం
స్విగ్గీ క్యూ2 నష్టం గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 1,092 కోట్లతో పోలిస్తే 15.6 శాతం తగ్గినప్పటికీ, గత జూన్ త్రైమాసికంలో ఉన్న రూ. 791 కోట్లతో పోలిస్తే మాత్రం మళ్లీ పెరిగింది. అయితే కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 36 శాతం వృద్ధితో రూ. 7,571 కోట్లకు చేరుకుంది. మరోవైపు, సర్దుబాటు చేసిన ఈబీఐటీడీఏ (EBITDA) నష్టం గత ఏడాది క్యూ2లోని రూ. 695 కోట్ల నుంచి రూ. 760 కోట్లకు పెరిగింది. ఈ నష్టం విశ్లేషకుల అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉండటమే షేరు పతనానికి ప్రధాన కారణమైంది.
ఇన్‌స్టామార్ట్ విభాగంపై పెరుగుతున్న భారాలు
స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం 'ఇన్‌స్టామార్ట్' (Instamart) నష్టాలు రోజురోజుకీ పెరిగిపోతుండటం పట్ల మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇన్‌స్టామార్ట్ సర్దుబాటు చేసిన ఈబీఐటీడీఏ నష్టం జూన్ త్రైమాసికంలోని రూ. 778 కోట్ల నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 895 కోట్లకు ఎగబాకింది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఇస్తున్న డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు , స్థిర వ్యయాలు బాగా పెరగడంతో కాంట్రిబ్యూషన్ మార్జిన్ కూడా నెగెటివ్‌లోకి జారిపోయింది.
టార్గెట్ ధరలను తగ్గించిన అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు
ఈ తీవ్రమైన నష్టాల నేపధ్యంలో గోల్డ్‌మన్ శాక్స్, హెచ్‌ఎస్‌బీసీ, సీఎల్‌ఎస్‌ఏ, జేపీ మోర్గాన్, సిటీ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు స్విగ్గీ షేరు టార్గెట్ ధరలను భారీగా తగ్గించాయి. క్విక్ కామర్స్ విభాగంలో పెరుగుతున్న పోటీ, హెచ్చుమీరుతున్న వ్యయాలే స్విగ్గీకి ప్రధాన సవాలుగా పరిణమించాయని జెఫరీస్ అభిప్రాయపడింది. ఇన్‌స్టామార్ట్ నష్టాలను అదుపులోకి తీసుకురాకపోతే షేరుపై ఒత్తిడి కొనసాగే అవకాశముందని స్పష్టం చేసింది.




